అనర్హత పిటిషన్‌పై షరీఫ్ విచారణ: పోతుల సునీత గైర్హాజరు, విప్ వర్తించదన్న శివనాథ్ రెడ్డి

By Siva KodatiFirst Published Jun 3, 2020, 4:35 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుల అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది

తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుల అనర్హత పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ.

వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ విప్ బుద్ధా వెంకన్న.. ఛైర్మన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఛైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబు హాజరయ్యారు.

Also Read:పోతుల సునీత ఇష్యూ: మాట తప్పి మడిమ తిప్పిన జగన్

అయితే ఆరోగ్యం సరిగా లేనందున విచారణకు హాజరుకాలేనని పోతుల సునీత సమాచారం అందించగా.. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని తనకు విప్ వర్తించందని శివనాథ్ రెడ్డి సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా బుద్ధా మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొక్కటి చేసేదొక్కటని బుద్ధా సెటైర్లు వేశారు.

Also Read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

ఎవరైనా వైసీపీలోకి రావాలనుకుంటే పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారని కానీ ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని వెంకన్న గుర్తుచేశారు. పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలపై తక్షణం అనర్హత వేటు వేయాలని బుద్ధా డిమాండ్ చేశారు. 
 

click me!