లోకేశ్ పాదయాత్రకు సర్కార్ అడ్డంకులు, మొన్నటి వరకు జీవో నెం 1తో..నేడు డీజీపీతో కుట్రలు : యనమల

By Siva KodatiFirst Published Jan 22, 2023, 4:10 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ రెడ్డి, అతని ముఠా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు .

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకుంటే రాష్ట్రంలోని యువతను అడ్డుకున్నట్లేనని అన్నారు. యువతకు జరిగిన అన్యాయం, వారి సమస్యలు తెలుసుకునేందుకు లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని యనమల పేర్కొన్నారు. జగన్ రెడ్డి, అతని ముఠా లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని రామకృష్ణుడు ఆరోపించారు . దీనిలో భాగంగానే జీవో నెం 1 తీసుకొచ్చారని.. అది ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో వుండటంతో, డీజీపి ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. 

పాదయాత్రకు సంబంధించి పొంతనలేని సమాచారం ఇవ్వాలని కోరుతూ డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని రామకృష్ణుడు దుయ్యబట్టారు. యువతలో జగన్ పాలనపై పెరుగుతున్న ఆగ్రహం, ఆవేశం , అసంతృప్తిని పోలీసులు, పాలకులు అడ్డుకోలేరని సీఎం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. శాంతియుతంగా ర్యాలీలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం దేశ ప్రజలకు హక్కు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో మనం ప్రజాస్వామ్య దేశంలో వున్నామా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు వెళ్తున్న విపక్ష నేతలకు అడుగడుగునా ఆటంకాలు, నిర్బంధాలు, హౌస్ అరెస్ట్‌లు , అక్రమ కేసులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని యనమల దుయ్యబట్టారు. 

ALso REad: 4 వేల కి.మీ, 400 రోజుల యాత్ర: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర

ఇకపోతే.. ఏడాదికి పైగా  ప్రజల్లో ఉండేలా  లోకేష్ పాదయాత్ర ప్లాన్  చేసుకున్నారు. రాష్ట్రంలోని  సుమారు  100 నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర సాగనుంది.  ఈ పాదయాత్రకు  చెందిన  లోగోను  టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఇటీవల గుంటూరులో ఆవిష్కరించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  అధికారంలోకి రావాలని  టీడీపీ పట్టుదలతో ఉంది. దీంతో లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల  అభిప్రాయాలను  పాదయాత్ర ద్వారా తెలుసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. 

click me!