మేం అమ్ముడుపోయామా, ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం.. 60 రోజులు డెడ్‌లైన్ : బొప్పరాజు

By Siva KodatiFirst Published Jun 18, 2023, 5:47 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం వచ్చే 60 రోజుల్లో ఎన్ని హామీలు అమలు చేస్తుందో చూస్తామన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఎన్ని హామీలను మంత్రివర్గంలో పెట్టి అమలు చేస్తారో పరిశీలిస్తామని పేర్కొన్నారు. 

ఏపీ ప్రభుత్వం వచ్చే 60 రోజుల్లో ఎన్ని హామీలు అమలు చేస్తుందో చూస్తామన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు , ప్రభుత్వం వేర్వేరు కాదన్నారు. కాకపోతే.. ఉద్యోగుల ఆందోళనలను రాజకీయ, ట్రేడ్ యూనియన్లు, ఇతర ఉద్యమాలతో ముడిపెట్టోద్దని బొప్పురాజు హితవు పలికారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రత్యర్ధి ఉద్యోగ సంఘాలపైనా బొప్పరాజు విమర్శలు చేశారు.

తాము చేసిన పోరాటం విజయవంతమై ప్రభుత్వం స్పందించిందన్నారు. 92 రోజుల పాటు జరిగిన ఉద్యమంలో తాము ఎక్కడ లొంగిపోయామో , ఎక్కడ అమ్ముడుపోయామో తమపై విమర్శలు చేస్తున్న వాళ్లు చెప్పాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తమపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని హామీలను మంత్రివర్గంలో పెట్టి అమలు చేస్తారో పరిశీలిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

Latest Videos

Also Read: ఓపీఎస్‌కు దగ్గరగానే జీపీఎస్, సమస్యలు పరిష్కరించినందుకు జగన్‌కు ధన్యవాదాలు : బొప్పరాజు

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానంపై కొన్ని ఉద్యోగ సంఘాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీపీఎస్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించేది లేదని.. సీపీఎస్ పోరాట సంఘాలు తేల్చిచెబుతున్నాయి. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తక్షణం అమలు చేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

జీపీఎస్‌ను స్వాగతించిన జేఏసీ నేతలపైనా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. జేఏసీ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సంబంధించి ఏపీ సీపీఎస్ఈఏ గౌరవ కార్యదర్శి బాజీ పఠాన్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 19, 26 తేదీల్లో స్పందనపై రెఫరెండం నిర్వహిస్తామని, జూలై 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా జేఏసీ నేతలకే జేపీఎస్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 


 

click me!