గుంటూరు జిల్లాలోని కొప్పర్రులో టీడీపీ కార్యకర్తలే తమ కార్యకర్తలపై దాడికి దిగారని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత ఆరోపించారు. ఈ గ్రామంలో ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు.
గుంటూరు:కొప్పర్రులో(kopparru) ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ(tdp) నేతలే ప్రయత్నించారని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి (mekathoti sucharitha) సుచరిత ఆరోపించారు.పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ(ysrcp) కార్యకర్తలను హోంమంత్రి సుచరిత గురువారం నాడు పరామర్శించారు. పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణనాన్ని సృష్టిస్తున్నారని చంద్రబాబునాయుడు(chandrababu) చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు.
టీడీపీ కార్యకర్తలు పథకం ప్రకారంగా దాడికి దిగారని ఆమె చెప్పారు. వంద మంది టీడీపీ కార్యకర్తలు రాళ్లు ఏర్పాటు చేసుకొని దాడికి దిగారని ఆమె తెలిపారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని చెబుతున్నారని గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎందుకు చూపించలేదని ఆమె ప్రశ్నించారు.కొప్పర్రులో టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ కొత్త సంస్కృతి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.
టీడీపీ నేత ఇంట్లో ముందస్తు ప్రణాళికతోనే వంద మంది ఆ పార్టీ కార్యకర్తలు సమావేశమై వైసీపీ కార్యకర్తలపై దాడికి దిగారని మంత్రి చెప్పారు. వైసీపీకి చెందిన శ్రీకాంత్ అనే కార్యకర్తను తీవ్రంగా కొట్టారని చెప్పారు. మరో వైసీపీ కార్యకర్త కన్ను కోల్పోయే పరిస్థితి నెలకొందని మంత్రి సుచరిత చెప్పారు.కొప్పర్రు ఘటనకు సంబందించిన దాడి దృశ్యాలను సుచరిత మీడియా ముందు ప్రదర్శించారు.