రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత సూచించారు.
గుంటూరు: దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో మత కల్లోలాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు భగవంతుని సైతం వాడుకుంటున్నారని హోంమంత్రి మండిపడ్డారు.
''రాజకీయంగా తాము రాష్ట్రంలో పట్టు కోల్పోతున్నామని ఆవేదనతో చిల్లర వేషాలకు పాల్పడుతున్నారు. బాధ్యత గల రాజకీయ నాయకులుగా కాకుండా బజారు మనిషిలాగా వ్యవహరిస్తున్నారు'' అని మండిపడ్డారు.
''రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. దేవాలయాల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి'' అని సూచించారు.
రామతీర్థంలో చంద్రబాబు పర్యటన (ఫోటోలు)
''రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద భద్రత చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు'' అన్నారు.
''మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు, రాజకీయ నాయకులు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్టి వారి చర్యలను ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదు... కఠిన చర్యలు తప్పక తీసుకుంటాం'' అని హోం మినిస్టర్ సుచరిత హెచ్చరించారు.