అమరావతి భూముల కేసులో చంద్రబాబుపై సీఐడీ విచారణకు ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు స్టే విధించింది.
అమరావతి: అమరావతి భూముల కేసులో చంద్రబాబుపై సీఐడీ విచారణకు ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు స్టే విధించింది.
అమరావతిలో అసైన్డ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి గత మాసంలో ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో జారీ చేసిన 41 జీవో కారణంగా అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబునాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23 వ తేదీ లోపుగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ లూథ్రా వాదించారు. ఇదే పిటిషన్ పై మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదించారు.
ప్రభుత్వ నిర్ణయంపై విచారణ చేసే అధికారం విచారణ సంస్థకు లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు.అధికారాన్ని తప్పుదోవపట్టించేందుకే ఈ ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు.ఈ కేసులో స్టే ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.
జీవో 41ను ఎవరూ వ్యతిరేకించలేదని.. కోర్టులో స్టే ఇవ్వలేదని బాబు న్యాయవాది గుర్తు చేశారు. సీఆర్డీఏ రద్దు వల్ల జీవో 41 కూడా ఇప్పుడు మనుగడ లేదని చంద్రబాబు తరపు న్యాయవాది చెప్పారు. లేని జీవోపై ఇప్పుడు విచారణ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టులో తమ వాదనలు విన్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను విన్పించారు.
also read:లేని జోవోలపై విచారణ,స్టే ఇవ్వండి: సీఐడీ కేసుపై హైకోర్టులో చంద్రబాబు న్యాయవాది
అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలుంటే చూపాలని సీఐడీని ఏపీ హైకోర్టు కోరింది.ప్రాథమిక విచారణలో ఉన్నందున ఈ విషయాలు చెప్పలేమని సీఐడీ తెలిపింది. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు.
దీంతో సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.అంతేకాదు అరెస్ట్ పై కూడ స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి నారాయణ కూడ ఇదే ఉత్తర్వులు జారీ చేసింది,.ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.