
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ట్విట్టర్‌పై (twitter) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (ap high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత న్యాయస్థానాలు, చట్టాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ట్విటర్‌లో పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జడ్జిల మీద అభ్యంతరకర పోస్టులపై ట్విట్టర్ దగ్గరున్న మెటీరియల్ స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తెలిపింది. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులిస్తామని హైకోర్టు హెచ్చరించింది. విదేశాల్లో ఉంటూ జడ్జిలపై పోస్టులు పెట్టినవారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం హైకోర్టు.. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.