ఉపాధి హామీ బిల్లులపై ఏపీ హైకోర్టు విచారణ... జగన్ సర్కార్ పై సీరియస్

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 1:40 PM IST
Highlights

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధిచిన బిల్లులపై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ పై సీరియస్ అయ్యింది. 

అమరావతి: ఉపాధి హామీ పథకం బిల్లులపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ పై మరోసారి సీరియస్ అయ్యింది. రూ.1794 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ.413 కోట్లు మాత్రమే చెల్లించడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసింది. నిధుల చెల్లింపు విషయంలో ఇంత అలసత్వ ఎందుకంటూ ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఇకపైనా ఇలాగే చేస్తే చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. 

మీరు పూర్తి సమాచారంతో ఎందుకు రావడం లేదంటూ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పడమేంటని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెప్పే సాకులు కౌంటర్లో కూడా లేవని ధర్మాసనం పేర్కొంది.

ప్రతి బిల్లులో 20 శాతం ఎందుకు కోత విధిస్తున్నారు అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మినహాయించిన డబ్బులు ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించింది. ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని అధికారులను నిలదీసింది ధర్మాసనం. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 

ఈ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

read more  ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్: అలా అయితే కోర్టుకు రావాల్సిందే

గతంలో జూలై 15న ఈ ఉపాధి హామీ నిధుల బకాయిలపై విచారణ జరిపిన హైకోర్టు ఆగష్టు 1వ తేదీలోపుగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే ఏపీ పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు  కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. ఉపాధి హామీ బకాయిలను చెల్లించాలని  ఆదేశాలు జారీ చేసినా ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.  

వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం  గురువారం నాడు విచారించింది. సీఎస్‌ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తమ ఆదేశాలను కాదని ఉపాధి హామీ బకాయిలను చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 

 

click me!