జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి హైకోర్టు షాక్: బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

By narsimha lodeFirst Published Jul 30, 2020, 11:42 AM IST
Highlights

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.


అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.  సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వాహనాలతో ప్రమాదాలు చోటు చేసుకొంటే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

also read:అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసు: జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు పోలీసు కస్టడీ

మోసపూరిత పనులను అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకొన్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకొన్నారు.

సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి రిజిస్ట్రేషన్ చేయించారనే నమోదైన కేసులపై కడప సెంట్రల్లో జైల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఉన్నారు.  ఇలా 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని వారిపై అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో  కూడ పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 

అయితే ఈ ఆరోపణలను జేసీ కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు. ఈ విషయం తమకు తెలియదని జేసీ కుటుంబం చెబుతోంది. ఇదే విషయమై తాము నాగాలాండ్ డీజీపీకి కూడ ఫిర్యాదు చేసిన విషయాన్ని జేసీ పవన్ కుమార్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
 

click me!