జగన్‌ సర్కార్‌కి హైకోర్టు షాక్: 53, 54 జీవోల కొట్టివేత

By narsimha lode  |  First Published Dec 27, 2021, 2:38 PM IST

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ జారీ చేసిన 53,54 జీవోలను ఏపీ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.



అమరావతి: ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ విడుదల చేసిన 53, 54 జీవోలను AP High court సోమవారం నాడు కొట్టివేసింది.  ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్‌లో ఫీజులను ఖరారు చేస్తే ఏపీ ప్రభుత్వం 53, 54 జీవోలను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నిర్వహించింది హైకోర్టు. ఈ రెండు జీవోలను కొట్టివేస్తూ సోమవారం నాడు  ఆదేశాలు జారీ చేసింది. private, Unaided పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ Ap Government తీసుకొచ్చిన జీవోలు 53, 54లను హైకోర్టు తోసిపుచ్చింది. 

also read:రాజధాని కేసుల విచారణను జనవరి 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..

Latest Videos

మేనేజ్‌మెంట్‌ నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమ్యాన్యాలు జోవోలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులను ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన ఖరారు చేస్తూ 53, 54 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోలపై ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి.  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు సహా మరికొన్ని విద్యా సంస్థల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ రెండు జీవోలను కొట్టివేసింది.

2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తించేలా ఫీజులను ఖరారు చేస్తూ ఆగస్టు ఆఖరులో జీవో నెం. 53, 54ను ప్రభుత్వం జారీ చేసింది. ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వం భావించింది. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా  పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో అమలు చేయలేకపోయారు. తర్వాత ఆగస్టులో  అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం జీవో 53, 54లను విడుదల చేసింది.

ఐదో తరగతి వరకు కనిష్టంగా ఏడాదికి రూ. పది వేలు.. గరిష్టంగా రూ. పన్నెండు వేలను  నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు వసూలు చేయాలని ప్రభుత్వం ఆ జీవోల్లో స్పష్టం చేసింది. ఇక ఆరు నుంచి పదో తరగతి వరకూ ఆ ఫీజులు రూ. 12 నుంచి 18వేలు మాత్రమే  వసూలు చేయలని ఆ జీవోల్లో పేర్కొంది.

 జూనియర్ కాలేజీల్లో ఏడాదికి రూ. పదిహేను వేలు కనిష్టం కాగా రూ. పద్దెనిమిది వేలు అత్యధికంగా నిర్ణయించారు. ట్యూషన్,  అడ్మిషన్, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ,  స్టూడెంట్‌ వెల్ఫేర్,  స్టడీ టూర్‌ ఇలా అన్నీ అందులోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని జీవోలో పేర్కొంది.  ఈ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు ఈ రెండు జీవోలను కొట్టివేసింది ఏపీ హైకోర్టు.


 

click me!