అమరావతి అసైన్డ్ భూముల కేసు.. సీఐడీ పిటిషన్లపై విచారణ నవంబర్ 1వ తేదీకి వాయిదా..

Published : Oct 16, 2023, 12:02 PM IST
అమరావతి అసైన్డ్ భూముల కేసు.. సీఐడీ పిటిషన్లపై విచారణ నవంబర్ 1వ తేదీకి వాయిదా..

సారాంశం

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే తమకు అందిన తాజా సాక్ష్యాధారాల దృష్ట్యా క్వాష్ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించాలని హైకోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే పలు ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. దీంతో నేడు విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు.. హైకోర్టుకు ఆడియో ఫైల్స్ సమర్పించారు.రేపు మరిన్ని ఆధారాలు వీడియో రూపంలో అందజేస్తామని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిశీలించింది. ఈ క్రమంలోనే కేసు రీఓపెన్‌పై అభ్యంతరాలు ఉంటే.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను కోర్టు తెలిపింది. దీంతో చంద్రబాబు, నారాయణ తరఫు లాయర్లు కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలోనే సీఐడీ పిటిషన్లపై విచారణను హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. 

ఇక, గత టీడీపీ  ప్రభుత్వ హయాంలో మంత్రులతో సహా ఆ పార్టీ నేతలు తక్కువ ధరలకు అసైన్డ్ భూములను మోసపూరితంగా కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. సీఐడీ అధికారులు 2021 మార్చి 12న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొనగా..  నారాయణను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, ఏపీ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసులో ఇప్పటివరకు సీఐడీ ఐదుగురిని అరెస్టు చేసింది.

అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, నారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.  తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ కొన్ని ఆడియో, వీడియో ఆధారాలు సీఐడీకి అందజేశారని తెలుస్తోంది. ఇందులో నారాయణ ఏ విధంగా భూములు కొనుగోలు చేశారనే విషయాలు ఉన్నట్లు సీఐడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు హైకోర్టులో తాజాగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్