నిండు గర్భంతో వున్న బిడ్డ మరో రెండుమూడు రోజుల్లో బిడ్డకు జన్మనిస్తుందనగా రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయిన హృదయవిధారక ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం : కట్టుకున్న భార్య కడుపుతో వుంది. మరో రెండు మూడు రోజుల్లో ఆమె ప్రసవం జరగాల్సి వుంది. ఇలా తమ జీవితంలోకి పండంటి బిడ్డ వస్తున్నాడని అతడు సంబురపడుతున్న వేళ విధి వింతనాటకం ఆడింది. భార్య కడుపులోని బిడ్డ కన్ను తెరవకముందే అతడు కన్నుమూసాడు. ఈ విషాదం విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అడవివరం వెంకటాద్రి నగర్ కు చెందిన ఉదయ్ కుమార్(32) ఐటీ ఉద్యోగి. బెంగళూరుకు చెందిన కంపనీలో ఉద్యోగం చేస్తున్న ఇతడు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ లో వున్నాడు. ఉదయ్ కి గతేడాదే సరిహతో వివాహం కాగా ప్రస్తుతం ఆమె గర్భంతో వుంది. నిండు గర్భిణి అయిన ఆమె మరో రెండుమూడు రోజుల్లో బిడ్డకు జన్మనివ్వనుంది.
ఇలా కుటుంబంలోకి మరో చిన్నారి వస్తుందన్న ఆనందంలో ఆ కుటుంబం వుండగా విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవురోజు కావడంతో విశాఖపట్నం మధురవాడలోని స్నేహితుడిని కలిసేందుకు ఉదయ్ బైక్ పై బయలుదేరాడు. మధ్యాహ్నం మరో స్నేహితుడు జగన్ తో కలిసి జాతీయ రహదారిపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. విశాఖ క్రికెట్ స్టేడియం సమీపంలోని మలుపు వద్ద వేగంగా వెళుతున్న బైక్ ను వెనకనుండి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయిన ఉదయ్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి స్నేహితుడు జగన్ తీవ్ర గాయాలపాలయ్యాడు.
Read More రక్తమోడిన రహదారి.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మృతి..
ఇంట్లోంచి బయటికి వెళ్లినవాడు ఇలా శవంగా తిరిగిరావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కన్నబిడ్డను కళ్లారా చూసుకోకుండానే కానరాని లోకాలకు పోయావా బిడ్డా అంటూ అతడి తల్లిదండ్రులు రోదించడం చూసేవారిని కన్నీరు పెట్టిస్తోంది. ఇక నిండు గర్భంతో వున్న ఉదయ్ భార్యను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. భర్త మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది.
ఉదయ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ర్యాష్ డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.