
అమరావతి: విశాఖపట్టణంలో ప్రభుత్వ భూముల అమ్మకంపై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.విశాఖపట్టణంలోని ఐదు చోట్ల ప్రభుత్వ భూములు విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.
గతంలో కూడ ఏపీ ప్రఁభుత్వం బిల్ట్ పేరుతో ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ భూముల విక్రయాన్ని నిరసిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు భూముల విక్రయానికి బ్రేక్ వేసింది.
ఏపీ బిల్ట్ విషయంలో ఇచ్చిన ఆదేశాలే విశాఖలో ప్రభుత్వ భూముల విక్రయం విషయంలో వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖలో ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి టెండర్లు ఖరారు చేయవద్దని హైకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకొనేందుకు ప్రభుత్వ భూములను విక్రయించాలని తలపెట్టింది. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో భూముల విక్రయానికి బిల్ట్ పేరుతో సన్నాహలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే.