
విశాఖపట్టణంలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. రుషికొండలో తవ్వకాలపై సర్వే చేయాలని కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. రుషికొండ తవ్వకాల అంశంలోదాఖలైన పిటిషన్‌లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రుషికొండ తవ్వకాల్లో భాగంగా మూడు ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించింది. అయితే మూడు కాదు 20ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే విభన్న వాదనలతో సర్వేకు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు జరిపారో.. ఎంత మేర భవనాలు నిర్మించారో సర్వే చేయాలని కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన హైకోర్టుకు సమర్పించాలని పేర్కొంది. సర్వే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
ఇక, సీఆర్‌జెడ్ పరిధిలోకి వచ్చే రుషికొండలో నిర్మాణ పనులు చేపట్టడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌ను కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది కెఎస్ మూర్తి పిల్ దాఖలు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్‌లపై గత విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు.. 9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని చెప్పారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం 9.88 ఎకరాలకే పరిమితమయిందని చెప్పారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఆఫిడవిట్ దాఖలు చేస్తామని.. అప్పటివరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా ఉందని సందేహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత నిజా, నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను నేటికి వాయిదా వాయిదా వేసింది.