
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల అంశంపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది. పార్టీ రంగుల కోసం దుర్వినియోగమైన ప్రజాధనం వసూలుపై డాక్టర్ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా దుర్వినియోగమైన రూ.4 వేల కోట్లు వైసీపీ, మంత్రులు, సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషనర్ తరపున అడ్వకేట్ డీఎస్‍ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు
కోర్టు తీర్పు వచ్చే వరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్ ఆపాలని... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రుల నుంచి బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు. విచారణ సందర్భంగా రూ. 4 వేల కోట్లు ఎలా ఖర్చయిందో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్ర ప్రదేశ్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను ముస్తాబు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోని పంచాయితీ భవనాలకు రంగులు వేయించింది. ఇంతవరకు బాగానే వున్న ప్రభుత్వం వేయించిన రంగులు వైసిపి జెండా రంగులను పోలివుండటం వివాదానికి దారితీసింది.
ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ రంగులు వేసిన వైసిపి సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అంతేకాకుండా ఇటీవల స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలోనూ ఈసీకి దీనిపై ఫిర్యాదులు అందాయి. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు.