రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్... హైకోర్టులో ఐదు గంటల సుధీర్ఘ వాదనలు

By Arun Kumar PFirst Published May 4, 2020, 7:55 PM IST
Highlights

ఎస్ఈసీ పదవి నుండి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి. 

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవినుండి అర్ధాంతరంగా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఏపి మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు  5 గంటల పాటు కొనసాగింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి విచారణను  రేపటికి వాయుదావేశారు. 

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణలు సుదీర్ఘంగా తమ వాదనలను వినిపించారు. కీలకమైన సమయంలో  నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని న్యాయవాదులు సీజె కు తెలిపారు. ధర్మాసనం ముందు తమ అభ్యంతరాలను తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. 

అనంతరం ఈ విచారణనను రేపటికి వాయిదావేశారు న్యాయమూర్తి. ఇదే విషయంపై దాఖలైన అన్ని పిటిషన్లపై మంగళవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. మరికొంతమంది పిటిషనర్ల వాదనలను విన్న తర్వాత న్యాయస్థానం తుదితీర్పు వెలువరించనుంది. 

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఆయన దాఖలుచేసిన పిటిషన్స్ తో పాటు వేరువేరుగా మరో 12 పిల్స్ కూడా దాఖలయ్యాయి. వీటన్నింటిపై ఇటీవలే ప్రస్తుత ఎస్ఈసీ కనగరాజ్ ఒకే కౌంటర్ ను దాఖలు చేశారు. ఓటరు గానీ, అభ్యర్ది గానీ కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు.నిమ్మగడ్డ మినహా మిగతా ఎవరెకీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ అన్నారు. 

గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషనర్లు ప్రశ్నించలేరని కనగరాజ్ అన్నారు. కేంద్రానికి భద్రత కోరుతూ నిమ్మగడ్డ దాఖలు చేసిన ఆఫీస్ ఫైల్స్ అందుబాటులో లేవని చెప్పారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు.ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివేనని ఆయన అన్నారు. 

నిమ్మగడ్డ ప్రభుత్వ సేవకుడిగానే ఎన్నికల కమిషనర్ పదవిలో నియమితులయ్యారని, నిమ్మగడ్డ చెబుతున్న ఎన్నికల హింస ప్రస్తుతం సర్వసాధారణమని అన్నారు. స్ధానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని చెప్పారు. స్దానిక పోరు వాయిదాకు కారణమైన కేంద్ర ప్రభుత్వ కరోనా హెచ్చరికలను నిమ్మగడ్డ ప్రస్తావించలేదని అన్నారు

స్ధానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదని చెప్పారు. నిమ్మగడ్డ తొలగింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదన న్యాయపరంగా చెల్లదని అన్నారు. ఎన్నికల  ప్రక్రియలో పారదర్శకత కోసమే పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్ కు అన్ని అధికారాలున్నాయని చెప్పారు. 

చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారని, ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదని కనగరాజ్ అన్నారు. కానును లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ ప్రభుత్వోద్యోగిగా నిమ్మగడ్డ చెప్పకూడదని అన్నారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చర్యలు తీసుకునేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందని చెప్పారు. 
ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ నిబంధనలు ఉల్లంఘించారనడం సరికాదని అన్నారు. నిమ్మగడ్డ పిటిషన్లో పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని కనగరాజ్ గుర్తు చేశారు.
 

click me!