లాక్ డౌన్ సడలింపు... జగన్ సర్కార్ ముందున్న అసలు సవాల్ ఇదే: పవన్ కల్యాణ్

Arun Kumar P   | Asianet News
Published : May 04, 2020, 07:13 PM ISTUpdated : May 04, 2020, 07:53 PM IST
లాక్ డౌన్ సడలింపు... జగన్ సర్కార్ ముందున్న అసలు సవాల్ ఇదే: పవన్ కల్యాణ్

సారాంశం

కరోనా పరిస్థితులపై చర్చించేందుకు అనంతపురం జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అనంతపురం: కరోనా వైరస్ అంటే ప్రపంచం అంతా వణికిపోతుంటే... ఏకంగా ఏపి ముఖ్యమంత్రే ఇది సాధారణ జ్వరమే అని మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం నెలకొని ఉందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఆరోగ్య విపత్తు నియంత్రణలో పాలన విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు మాట్లాడుతూ తాము పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ఏపీలోని కర్నూలు, గుంటూరుల్లా అయ్యేదని అన్నారంటే ఏపీలో పరిస్థితి అర్థమవుతోంది అన్నారు. ఏపీని ఉదహరించే పరిస్థితి రావడం బాధకారమే అని తెలిపారు. 

సోమవారం ఉదయం అనంతపురం జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రభుత్వ చర్యలు, లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులు, రైతాంగం, చేనేత వృత్తి వారి కష్టాలు, వలస కూలీల బాధలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “జాతీయ స్థాయి నాయకులతో కరోనా వ్యాప్తి తీరు, ఉద్ధృతి మరెంత కాలం ఉండవచ్చు, లాక్ డౌన్ సడలింపులపై చర్చించాను. లాక్ డౌన్ సడలింపు తరవాతే అసలు సవాల్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ జోన్ ప్రాంతాలు ఆరెంజ్, ఆరెంజ్ జోన్ ప్రాంతాలు రెడ్ పరిధిలో రాకుండా చూసుకోవడమే అసలు సవాల్. ఈ విషయంలో రాష్ట్ర పాలన యంత్రాంగం చాలా అప్రమత్తంగా, సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సాధారణ జ్వరం అనే విధంగా మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుంది. మన ఆరోగ్య శాఖ పటిష్టంగా లేకపోవడం వల్ల తలెత్తే దుష్ఫలితాలు కరోనాతో బయటపడుతున్నాయి. పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయంగా అయిపోయారు. కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచీ ప్రజారోగ్యం విషయంలో పకడ్బందీగా ఉండటంతో కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించగలిగాయి. మన రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినవారికి సరైన సదుపాయాలు లేవనీ, సక్రమంగా ఆహారం అందటం లేదనే విషయం తెలిసింది. 

భవన నిర్మాణ కార్మికులు... చేనేత వృత్తివారికి భరోసా ఇవ్వాలి 

ఆపదలో ఉన్నవారికి అండగా ఉండటం మన పార్టీ బాధ్యత. ఉపాధి వెతుక్కొంటూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చిక్కుకుపోయినవారి గురించి మన నాయకులు, కార్యకర్తలు తెలియచేయగానే ఎంతో బాధ్యతతో స్పందించాం. భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తు మూలంగా ఆ పార్టీ జాతీయ నాయకులతో, సంబంధిత రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకున్నాం. ట్విటర్ ద్వారా తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు విజ్ఞాపనలు పంపగానే వారు సత్వరమే స్పందించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మన పార్టీ తరఫున సామాజిక మాధ్యమాల ద్వారా బలంగా మాట్లాడదాం. ఈ మాధ్యమంలో మన పార్టీ శ్రేణులు ఎంతో చురుగ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను చెబుతూ... మన బాధ్యతగా మన పార్టీ ఏం చేస్తుందో చెబుదాం.

అనంతపురం జిల్లాలో రైతాంగం కరవుతో నష్టపోయేవారు. ఈసారి వారిని కరోనా నష్టపరచింది. ఉద్యాన పంటలు వేసినవారు తీవ్ర ఇక్కట్లలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. కరవు ప్రభావిత జిల్లా అయిన అనంతపురానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, ఇతర సాయాలపై, రైతులను ఆదుకొనే విధంగా చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా స్పందిద్దాం. అదే విధంగా చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల బాధలు నా దృష్టికి చేరాయి. ఇసుక విధానంతో, ఇప్పుడు కరోనాతో ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులు. కార్మికులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. కరోనా మూలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు జనసేన నాయకులు, శ్రేణులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం” అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu