
గ్రామ, వార్డ్ సచివాలయాలలో (village secretariat) మహిళా కార్యదర్శులను (women secretaries) పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (ap high court) మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎస్, డీజీపీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్‌కు (ap district police act) విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసుల్ని రాష్ట్రప్రభుత్వం (ap govt) ఇటీవల హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 14,910 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టులకు గాను ప్రస్తుతం 14,313 మంది ఉన్నారు. త్వరలోనే వీరికి రెండేళ్ల ప్రొబెషన్ సర్వీసు పూర్తి కానుంది. దీంతో వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. మహిళా పోలీస్‌గా పేర్కొంటూ కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతల్ని తెలిపారు. మహిళా పోలీసులకు అవసరమైన శిక్షణతో పాటు ప్రస్తుతం మహిళా కానిస్టేబుళ్లు వినియోగిస్తున్న యూనిఫాంను వీరికి కూడా ఇస్తారు. మహిళా పోలీసులు తమ గ్రామ, వార్డు సచివాలయానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. వీరికి పదోన్నతి కోసం అదనపు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను సృష్టిస్తారు. మహిళా పోలీసులుగా తగిన అధికారాలు, విధుల కల్పనకు చట్టంలో అవసరమైన మార్పులు చేస్తారు.
Also Read:వాలంటీర్లకు పరీక్షలు.. ఏపీ సర్కార్ నోటిఫికేషన్, ఉత్తీర్ణత సాధిస్తేనే
అయితే దీనిపై విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు (areti uma maheswara rao) అభ్యంతరం తెలుపుతూ ఈ నెల 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59ని రద్దు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. పోలీస్ శాఖలో నియామకాలు పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలన్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణ యం ఉందన్నారు. పోలీసుల విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించరన్నారు.