భూముల కుంభకోణం: మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబుకు హైకోర్టు షాక్

By Siva KodatiFirst Published Oct 21, 2020, 9:00 PM IST
Highlights

ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 

ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సుధీర్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుధీర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 

రాజధాని అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డుల తారుమారు కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్‌ అన్నే సుధీర్‌ బాబును, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, విజయవాడలో ఎం అండ్‌ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్‌ను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేశారు.

వీరిద్దరిని మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వీవీఎన్‌వీ లక్ష్మి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు.

సుధీర్‌ బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను ఇష్టానుసారం తారుమారు చేయడం, భూమిని ల్యాండ్‌పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకు ఇవ్వడం చేశారని విచారణాధికారుల పరిశీలనలో వెల్లడైంది.

గతంలో ఆర్డీవోగా పనిచేసిన వ్యక్తి పరోక్ష సహకారం కూడా ఉందని అంచనాకు వచ్చారు. ఈ మోసాన్ని ఆ తర్వాత తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పూర్ణచంద్రరావు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు.

రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు కూడా తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. 

click me!