
రాజధాని కేసుల రోజువారి విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prashant Kumar Mishra) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) రాజధాని కేసుల రోజువారి విచారణ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఆర్‌డీఏ (CRDA) రద్దు, పాలన వికేంద్రీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తుంది. ఇక, రెండో రోజు విచారణ సందర్భంగా రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ (Shyam Divan) వాదనలు వినిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారని అన్నారు. అలాంటప్పుడు అమరావతి (amaravati) రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ అంశాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు.
స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడడం అంటే కేవలం వారి కోసం పోరాడలేదని.. దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని చెప్పారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.
ఇక, రైతుల తరఫున వాదనలు వినిపించిన లాయర్ శ్యామ్ దివాన్ పలు అంశాలను హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో అమరావతి దెయ్యాల రాజధానిగా మారిందన్నారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.