
అమరావతి: పంచాయతీ ఎన్నికలకు 2021 ఓటర్ల జాబితా పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. తొలుత ఎల్లుండి విచారించాలని ధర్మాసనం భావించింది. ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుందని కోర్టుకు న్యాయవాదులు చెప్పడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే, 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ సరికాదని హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటిషన్ వేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 2021 ఓట్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పిటిషన్‌లో కోరారు.. 2019 జాబితాతో 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్ చెప్పారు.
ఓటరు జాబితా తయారీలో పంచాయితీ రాజ్ శాఖాధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల విధులకు పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు ఎన్నికలకు విధులకు అనర్హులని మంగళవారం నాడు ప్రోసిడీంగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.