పంచాయతీ అధికారులపై వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ: రేషన్ డెలివరీ వాహనం ఎక్కి....

By telugu teamFirst Published Feb 3, 2021, 10:19 AM IST
Highlights

ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను నిర్బంధ పదవీ విరమణ చేయించాలని ఆదేశిస్తూ రాసిన లేఖను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉపసంహరించుకున్నారు. కాగా, రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేశారు.

అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేదిల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గారు. ఆ ఇద్దరు అధికారులను నిర్బంధ పదవీ విరమణ చేయించాలనే లేఖను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ అధికారుల అభిశంసన ఉత్తర్వులకు మాత్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.  

ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించారు. రేషన్ డెలివరీ వాహనాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోను తొలగించాలని గతంలో రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దానిపై వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. తుది నిర్ణయం ఎస్ఈసీదేనని కోర్టు స్పష్టం చేసింది. 

దాంతో రేషన్ డెలివరీ వాహనాలను అధికారులు ఎస్ఈసీ ముందు ప్రదర్శించారు. ఏపీ ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ రూపోందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన వాహనాలను నిమ్మగడ్డ పరిశీలించారు. పంపిణీ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వివరించారు. 

వాహనం ఎక్కి వాహనంలో ఉన్న సదుపాయాలను, వినియోగాన్ని ఆయన పరిశీలించారు. వాహనం డ్రైవర్ కేబీన్ లో కూర్చుని రేషన్ పంపిణీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పౌర సరఫరాల అధికారులతో సమావేశమయ్యారు. 

click me!