విజయవాడ దుర్గగుడి ఈవోపై బదిలీ వేటు.. దసరా ఉత్సవాలకు ముందు కీలక పరిణామం

By Siva Kodati  |  First Published Oct 1, 2023, 9:22 PM IST

దసరా శరన్నవరాత్రులకు ముందు విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను ఏపీ ప్రభుత్వం బదిలీపై పంపడం కలకలం రేపుతోంది.  ఆలయ నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావును నియమించింది.  


దసరా శరన్నవరాత్రులకు ముందు విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబను ఏపీ ప్రభుత్వం బదిలీపై పంపడం కలకలం రేపుతోంది. భ్రమరాంబ స్థానంలో ఆలయ నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావును నియమించింది. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు రాష్ట్రంలో మరికొందరు ఉన్నతాధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. డిప్యూటీ కలెక్టర్‌గా వున్న పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్వోగా.. కృష్ణా జిల్లా డీఆర్వో‌గా వెంకట రమణను బాపట్ల జిల్లా డీఆర్వోగా బదిలీ చేసింది. అలాగే ఎస్వీ నాగేశ్వరరావును ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోగా నియమించింది ప్రభుత్వం. 

అయితే సరిగ్గా శరన్నవరాత్రులకు కొద్దిరోజుల ముందు ఈవో భ్రమరాంబ బదిలీ వ్యవహారం విజయవాడతో పాటు దేవాదాయ శాఖలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ బదిలీ వెనుక రాజకీయ కోణం వున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

Latest Videos

ఇకపోతే.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్లో ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఉత్సవాలు జరిగే పది రోజుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరికొంతమంది సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు రాంబాబు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 

ఏ రోజున ఏ అలంకారం అంటే :

అక్టోబర్‌ 15 - బాలా త్రిపురసుందరి
అక్టోబరు 16 - గాయత్రీ దేవి
అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి
అక్టోబరు 18 - మహాలక్ష్మి 
అక్టోబరు 19 - మహాచండీ
అక్టోబరు 20 - సరస్వతి
అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి
అక్టోబరు 22 - దుర్గాదేవి
అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి
 

click me!