టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ : ఏపీ సర్కార్ సీరియస్.. ఇకపై పరీక్షా కేంద్రాల్లో కఠిన నిబంధనలు, వాటికి నో ఎంట్రీ

Siva Kodati |  
Published : Apr 28, 2022, 07:39 PM IST
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ : ఏపీ సర్కార్ సీరియస్.. ఇకపై పరీక్షా కేంద్రాల్లో కఠిన నిబంధనలు, వాటికి నో ఎంట్రీ

సారాంశం

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకైనట్లుగా వార్తలు రావడంతో ఏపీ విద్యాశాఖ అప్రమత్తమైంది. పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. 

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ (10th class exam papers leak) ఘటనకు సంబంధించి ఏపీ విద్యాశాఖ (ap education department) మరింత అలర్ట్ అయ్యింది. పదో తరగతి పరీక్షా  కేంద్రాల్లో సెల్‌ఫోన్‌లు నిషేధిస్తూ సర్క్యూలర్‌లు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి  విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లేందుకు వీలు లేదని విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. పరీక్షల విధుల్లో సంబంధం లేదని సిబ్బందిని ఎట్టి పరిస్ధితుల్లోనూ పరీక్షా కేంద్రాలకు అనుమతించొద్దని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డీఈవోలకు ఆదేశాలిచ్చారు. 

మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రాలు ఎక్కడా లీక్ కాలేదని.. విద్యార్ధులు , తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దని తెలిపింది విద్యాశాఖ. నిన్నటి నుంచి మొదలైన పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా ప్రశ్నాపత్రం లీక్ కాలేదని స్పష్టం చేసింది. నంద్యాలలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌లో సర్క్యూలేట్ చేశారని దీనికి సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశామని విద్యా శాఖ తెలిపింది. 

ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు సంబంధించి విద్యా శాఖ వివరణ ఇచ్చింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో పేపర్‌ను వైరల్ చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని.. దానిని లీకుగా పరిగణించలేమని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ అన్నారు. నంద్యాల జిల్లా అంకిరెడ్డి పల్లె ప్రభుత్వ స్కూల్ నుంచి క్వశ్చన్ పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. చీఫ్ సూపర్‌వైజర్, ఇన్విజిలేటర్‌లను బాధ్యులుగా చేస్తున్నామని.. వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె జడ్పీ స్కూల్‌లో టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనలో 12 మంది టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను బనగానపల్లె కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న నలుగురిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కీలక సూత్రధారి సీఆర్‌పీ రాజేశ్ సహా 11 మంది తెలుగు టీచర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే సీఆర్పీ రాజేశ్ తన మొబైల్‌తో ప్రశ్నాపత్రం ఫోటో తీసి సమాధానాల కోసం బయట వేచివున్న 9 మంది తెలుగు టీచర్ల ఫోన్‌కు పంపినట్లు విచారణలో వెల్లడైంది. 

మరోవైపు పదో తరగతి పరీక్షల్లో అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ విద్యాసంస్థ సిబ్బంది మాల్ ప్రాక్టీస్ చేసినట్లు గుర్తించారు. నిందితులుగా తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి, తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీ లెక్చరర్ కె సుధాకర్‌లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu