పిట్ట కథలు మేం నమ్మం.. నగదు విత్ డ్రాపై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాలు

By Siva KodatiFirst Published Jun 30, 2022, 5:05 PM IST
Highlights

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోంచి రూ.800 కోట్లు మాయమైన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలను చెబుతోంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (ap govt employees) ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని (gpf accounts) నగదు మాయమైన ఘటన రాజకీయంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా నగదు విత్ డ్రా కావడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావులు గురువారం సచివాలయంలో ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మను కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై తమకు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యోగ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలతోనే నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారని సూర్యనారాయణ పేర్కొన్నారు. అధికారులు చెబుతున్న సమాధానంపై తాము సంతృప్తి చెందలేదని సీఎస్‌కు వివరించినట్లు తెలిపారు.

తమ ఖాతాల్లోంచి డబ్బు పోయిందని టెన్షన్ పడుతుంటే ఆర్థికశాఖ అధికారులు పిట్ట కథలు చెబుతున్నారని సూర్యనారాయణ మండిపడ్డారు. అధికారులు చెబుతున్న మాటలను తాము నమ్మేది లేదని ఆయన స్పష్టం చేశారు. నగదు ఉపసంహరణపై న్యాయ పోరాటం చేస్తామని సూర్యనారాయణ వెల్లడించారు. సీఎస్‌, ఆర్థికశాఖ ఉద్యోగులు, సీఎఫ్‌ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌటెంట్ జనరల్‌ను ప్రతివాదులుగా చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఉద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు తీయడం నేరమని సూర్యనారాయణ స్పష్టం చేశారు. డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వాటితోనే జీతాలు పెరిగినట్లు గతంలో చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు డీఏ బకాయిలు వేయలేదంటున్నారని మేం ఏది నమ్మాలని సూర్యనారాయణ నిలదీశారు. 

Also REad:ఏపీ ప్రభుత్వోద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు మాయం... ఆర్థిక శాఖ అధికారులు ఏమంటున్నారంటే..

కాగా.. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుండి డబ్బులు మాయమవడం వివాదాస్పదమవుతోంది. వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతానుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. ఉద్యోగుల ఖాతాలో జమచేసిన దాదాపు రూ.800 కోట్లు విత్ డ్రా అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో నిన్న ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణ ను ఏపి ఉద్యోగసంఘాల జేఎసి,  అమరావతి ఉద్యోగ సంఘాలు ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణలను కలిశారు. 

ఈ సందర్భంగా ఏపీ జేఏసి ఛైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు మాయంపై ఆర్థిక అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఉద్యోగుల జిపిఎస్ ఖాతాలనుండి డబ్బులు మాయం వెనక కారణమేంటో తెలపాలని కోరామన్నారు. అయితే ఇది ఎలా జరిగిందో తెలియడం లేదని అధికారులు అంటున్నారని బండి శ్రీనివాస్ తెలిపారు. 

కింది స్థాయి అధికారుల నుండి రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. డబ్బులు వేసి తీసేయడం టెక్నికల్ సమస్యగా కనిపిస్తోందని... అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామని అధికారులు తెలిపారన్నారు.  సాయంత్రం మరోసారి సమావేశం ఏర్పాటుచేసి అన్ని విషయాలు చెబుతామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు బండి శ్రీనివాస్ తెలిపారు. 
 

click me!