కఠారి దంపతుల హత్య కేసులో ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకుంటానంటూ ఏపీపీ పిటిషన్, కోర్ట్ రియాక్షన్ ఇదే

Siva Kodati |  
Published : Jun 30, 2022, 04:36 PM IST
కఠారి దంపతుల హత్య కేసులో ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకుంటానంటూ ఏపీపీ పిటిషన్, కోర్ట్ రియాక్షన్ ఇదే

సారాంశం

కఠారి అనూరాధ దంపతుల హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటానంటూ ఏపీపీ పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. అయితే కోర్ట్ మాత్రం అందుకు అంగీకరించలేదు.   

ఇటీవల చిత్తూరు మాజీ మేయర్ , టీడీపీ నేత కఠారి హేమలతపైకి పోలీసులు జీపు ఎక్కించిన ఘటనతో మరోసారి కఠారి అనూరాధ దంపతుల ( katari mohan murder case) హత్యకేసు వెలుగులోకి వచ్చింది. నిందితులను కాపాడేందుకు వైసీపీ (ysrcp) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కఠారి దంపతుల హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 

ఈ కేసు విచార‌ణ నుంచి త‌ప్పుకుంటానంటూ అద‌న‌పు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ చిత్తూరు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన న్యాయస్థానం ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. విచార‌ణ కీల‌క ద‌శ‌కు చేరుకున్న నేపథ్యంలో విచార‌ణ నుంచి త‌ప్పుకోవ‌డం కుద‌ర‌ద‌ని కుండబద్ధలు కొట్టింది. కేసు ముగిసేదాకా విచార‌ణ‌లో పాలుపంచుకోవాల్సిందేన‌ని స్పష్టం చేసింది.

ఇకపోతే.. చిత్తూరు జిల్లా టీడీపీలో సమర్ధుడైన నేతగా పేరు తెచ్చుకున్న కఠారి మోహన్ 2013లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. దీంతో ఆయన సతీమణి అనూరాధను మేయర్ గా ఎంపిక చేసింది అధిష్టానం. అయితే రాజకీయంగా, వ్యక్తిగతంగా మోహన్ కు వైరం వుండటంతో ప్రత్యర్ధులు కఠారి దంపతుల హత్యకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మోహన్ తో పాటు అనూరాథను పట్టపగలు అందరూ చూస్తుండగా మేయర్ ఛాంబర్ లోనే దారుణంగా హతమార్చారు. ఈ హత్యలో మోహన్ అల్లుడు చింటూ రాయల్ హస్తం కూడా వుండటం సంచలనం సృష్టించింది. 

Also Read:కఠారి దంపతుల హత్య : ప్రశ్నిస్తే మీదకి జీపు ఎక్కిస్తారా , పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖ

అయితే హత్య జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంత వరకు నిందితులకు శిక్ష పడకపోవడం, విచారణ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంతో కఠారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణను అనూరాథ దంపతుల కోడలు హేమలత కలిశారు. దీనిపై స్పందించిన ఆయన కేసు విచారణ వేగంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విచారణలో వేగం కనిపించింది. 

మరోవైపు.. ఈ హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (chandrababu naidu) గత శనివారం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి (ap dgp rajendranath reddy) లేఖ రాశారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, అయితే బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు సాక్షులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం సరికాదని ఆయన హితవు పలికారు. 

అటు, మాజీ మేయర్ కఠారి హేమలత విషయంలోనూ పోలీసుల వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. పోలీసు చర్యలను నిరసించిందన్న కారణంగా హేమలతపై పోలీసు జీపు ఎక్కించారని, ఇప్పుడు ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉందని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, హేమలత గాయపడడానికి కారకులైన వారిని ఆసుపత్రిలో చేర్చి, తిరిగి హేమలతపైనే కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్