
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అల్లర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానిలకు హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో చల్లా బాబుపై 7 కేసులు నమోదు చేయగా.. నాలుగింట్లో కోర్ట్ బెయిల్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా.. సాగు నీటి ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లే సమయంలో హింసాత్మక పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అనుమతి తీసుకున్న రూట్ లో కాకుండా మరో రూట్ లో చంద్రబాబు వచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీ అధినేత వెళ్లే రూట్ లో వైసీపీ శ్రేణులు లారీలను అడ్డు పెట్టడంపై తమ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో పోలీసులు చోద్యం చేశారని ఆ పార్టీ పేర్కొంది. అయితే పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుబట్టారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని జిల్లా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: ఢిల్లీకి టీడీపీ బృందం... పుంగనూరు, అంగళ్ళు ఘటనలపై ప్రధాని మోదీకి ఫిర్యాదు
ఇదిలావుంటే పుంగనూరు, అంగళ్లులో తనపై జరిగిన దాడులపై సాధాసీదావేమీ కాదని... ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న తనను వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు పథకం ప్రకారము అడ్డుకున్నాయని చంద్రబాబు అన్నారు. తనను చంపాలన్న కుట్రలో భాగమే ఈ దాడిగా చంద్రబాబు పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం చేస్తే అందరూ భయపడుతారనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేయించాడని అన్నారు. అందుకే పుంగనూరు, అంగళ్లు ఘటనలపై సిబీఐతో సమగ్రంగా విచారణ జరిపించి తనపై దాడిలో ఇంకా ఎవరెవరి పాత్ర వుందో తేల్చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.