ఏపీలో స్కూల్స్‌కు 12 రోజులు దసరా సెలవులు.. ఎప్పటినుంచంటే..

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 9:20 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. పాఠశాలలకు మొత్తంగా 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అయితే ఈ నెల 25వ తేదీ ఆదివారం కావడంతో.. పాఠశాలలకు మొత్తంగా 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 7వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, సెలవుల తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలకు, 80 సెలవులు ఉండనున్నట్టుగా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు తెలంగాణ సర్కార్‌ కూడా దసరా పండుగ‌కు భారీగా  సెల‌వులను ప్ర‌క‌టించింది. అక్టోబర్ 5 న దసరా పండుగ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో.. ఈ నెల 26 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్ర‌క‌టించింది. అయితే.. సెప్టెంబర్ 25 ఆదివారం, అక్టోబర్ 9 ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన నేప‌థ్యంలో..  9,10 తరగతి విద్యార్థుల‌కు సెలవులు తగ్గించాలని యోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో వారి కూడా మొత్తం 15 రోజుల సెలవులు వ‌చ్చాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.

click me!