
వరద సాయంపై చంద్రబాబు (chandrababu naidu) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్మని పరిస్ధితి వుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని సజ్జల తెలిపారు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని.. పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు పర్యటిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన వుంటే వర్షాలు సరిగా పడవని ఎద్దేవా చేశారు. తుఫాన్‌ల సమయంలో నయా పైసా సాయం అందించారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే పుష్కరాల్లో అపశృతి జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇకపోతే.. టీడీపీ (tdp) తెలివి తక్కువతనంతోనే లోయర్ కాపర్ డ్యామ్ మునిగిపోయిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఆరోపించారు. కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని అన్నారు. ఇది నిజమో కాదో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పోలవరంపై టీడీపీ చెబుతున్న మాటలు అవాస్తవం అని అన్నారు. స్పిల్ వేను ఆపేసి డయాఫ్రమ్ ఎలా నిర్మించారని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు చేశారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వరదలతో ఢయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పారు. రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత స్పిల్ వేను, అప్రోచ్ చానల్‌ను పూర్తి చేశామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. స్పిల్ వే ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పెద్ద మొత్తంలో వరద వచ్చిన ప్రాజెక్టుకు నష్టం కలగకుండా కాపాడారని చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులను అభినందిస్తున్నట్టుగా తెలిపారు.