కేంద్ర కార్యదర్శులతో ఏపీ బృందం కీలక భేటీ.. త్వరలోనే మంచి సమాచారం అందుతుందన్న విజయసాయి రెడ్డి

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 3:03 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పెండింగ్ సమస్యలపై ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శలుతో కూడిన కమిటీతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ అయింది. 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పెండింగ్ సమస్యలపై ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శలుతో కూడిన కమిటీతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ అయింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) .. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను,  పోలవరం నిధులు, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలు.. తదితర అంశాలపై చర్చించారు. ఈ మేరకు మోదీకి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఏపీ ప్రభుత్వ బృందం సోమవారం (జనవరి 24) భేటీ అయింది. 

ఈ బృందంలో ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ఏపీ ప్రతినిధులు బృందం కేంద్ర కార్యదర్శుల బృందాన్ని కోరినట్టుగా తెలిసింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని,  విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థలన్నింటికీ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం కోరింది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు విషయం ఈ సందర్భంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. 

ఈ భేటీ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో అన్ని అంశాలపై సానుకూల పరిష్కారం వచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిపారు. పోలవరంతో పాటు ప్రతి అంశాన్ని ఈ సమావేశంలో చర్చించి.. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం జరిగిందన్నారు.  ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన లేఖలోని అన్ని అంశాలకు సామరస్య పూర్వకమైన పరిష్కారం లభించిందని చెప్పారు. త్వరలోనే మంచి సమాచారం అందుతున్నారు.

click me!