వైయస్ వివేకా హత్యకేసు: సిట్ నియమించిన జగన్ సర్కార్

By Nagaraju penumalaFirst Published Jun 19, 2019, 7:20 PM IST
Highlights

వైయస్ జగన్ సర్కార్ వేసిన సిట్ లో 23 మంది ఉన్నతాధికారులను నియమించారు. వారిలో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలతోపాటు మెుత్తం 23 మందితో దర్యాప్తు బృందాన్ని నియమించింది. 
 

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వేగం పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో మరో సిట్ ను నియమించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న అయిన వైయస్ వివేకానందరెడ్డి మార్చి 15న తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. 

మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ఆనాటి ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ దర్యాప్తుపై వైయస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైయస్ జగన్ సీఎం కావడంతో తన చిన్నాన్న హత్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపోతే వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్ సునీత ఇటీవలే సీఎం వైయస్ జగన్ ను కలిశారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయిన ఆమె తన తండ్రిహత్యపై గంటకు పైగా చర్చించారు. కేసు విచారణలో వేగం పెంచాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆనాటి చంద్రబాబు నాయుడు సర్కార్ వేసిన సిట్ స్థానంలో మరో సిట్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వైయస్ జగన్ సర్కార్ వేసిన సిట్ లో 23 మంది ఉన్నతాధికారులను నియమించారు. వారిలో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలతోపాటు మెుత్తం 23 మందితో దర్యాప్తు బృందాన్ని నియమించింది. 

ప్రభుత్వం నియమించిన కొత్త సిట్ బృందం తక్షణమే విధుల్లో చేరింది. తొలుత వైయస్ వివేకానందరెడ్డి వాచ్ మన్ రంగయ్యను విచారించారు. దీంతో వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు సంస్థ వేగవంతం చేసినట్లైంది.

మరోవైపు వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రస్తుతం కడప జిల్లా సబ్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. వారిని కూడా సిట్ దర్యాప్తు సంస్థ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

click me!