
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ సర్కార్ షాకిచ్చింది. సంగం డెయిరీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
డెయిరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ మయూర్ అశోక్.. వడ్లమూడిలోని సంగం డెయిరీకి చేరుకున్నారు. మరోవైపు డెయరీ వ్యవహారంలో ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read:అవినీతి కేసులు, అక్రమ అరెస్ట్... హైకోర్టును ఆశ్రయించిన ధూళిపాళ్ల నరేంద్ర
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఈ డెయిరీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఛైర్మన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది.