కేసీఆర్‌కి జగన్ షాక్: రాయలసీమ కరువు నివారణ పథకంలో 14 ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Sep 3, 2020, 3:19 PM IST
Highlights

రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ దూకుడును పెంచింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని వాడుకొంటూ ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు.

అమరావతి: రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ దూకుడును పెంచింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని వాడుకొంటూ ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా వినియోగించుకోనున్నారు. రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 పనులను చేపట్టేందుకు ఏపీ కేబినెట్  గురువారం నాడు ఆమోదం తెలిపింది. 

రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా 14 ప్రాజెక్టుల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవాలంటే పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు అనివార్యంగా మారింది.

రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా నిర్మించే 27 ప్రాజెక్టుల కోసం అవసరమైన మౌళిక సదుపాయాలు, నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 27వ తేదీన ఎస్ పీ వీని ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

రాయలసీమను కరువు నుండి పారదోలేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. అయితే దీని కోసం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉన్నాయి.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సాగు, తాగు నీటికి కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ చెబుతోంది.

తమ వాటా నీటిని మాత్రమే వాడుకొంటామని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది. పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా 30 నుండి 40 రోజుల్లో నీటిని తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తమ వాటా నీటిని 120 రోజుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకొంటుంది.

పోతిరెడ్డి పాడు ద్వారా ప్రస్తుతం రోజుకు 44వేల క్యూసెక్కులను డ్రా చేసుకొనే వెసులుబాటు ఏపీ ప్రభుత్వానికి ఉంది.శ్రీశైలం ప్రాజెక్టులో 880 అడుగులకు నీరు చేరితేనే  44 వేల క్యూసెక్కుల నీరు డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంటుందని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. 850 అడుగుల నీరుంటే కేవలం 7 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వాడుకొనే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నేతలు వ్యతిరేకిస్తున్నా కూడ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని 7 వేల క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయమై ఆనాడు టీఆర్ఎస్ సహ పలు తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు.

also read:ఏపీకి ఊరట: పోతిరెడ్డిపాడుపై సుప్రీంలో తేలేవరకు విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణకు చెందిన ప్రాజెక్టులన్నీ కూడ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుండే నీటిని వాడుకోవచ్చు. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టుకు 796 అడుగుల నుండే నీటిని ఉపయోగించుకోవచ్చని ఏపీ గుర్తు చేస్తోంది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను నిరసిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు దాఖలు చేసింది. మరో వైపు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై చర్చించే అవకాశం లేకపోలేదు.
 

click me!