
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు రెండో రోజు కొనసాగుతుంది. విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్‌లో.. ఈరోజు కూడా ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది. ఈ రోజు సమ్మిట్‌లో 11 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా కూడా సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు. ఈ రోజు సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్వానంద్ సోనోవాల్ కూడా హాజరుకానున్నారు. వీరు కూడా సమ్మిట్‌లో కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం సమ్మిట్ వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉండనుంది.
ఇక, రెండు రోజుల ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ వంటి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పారిశ్రామికవేత్తలు.. ఏపీ అభివృద్దిపై ప్రశంసలు కురిపించారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడితో 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, తద్వారా 20 రంగాల్లో దాదాపు ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు.
శుక్రవారం రోజున 11.85 లక్షల కోట్ల పెట్టుబడితో 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ 92 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. 1.15 లక్షల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధితో మిగిలిన 248 అవగాహన ఒప్పందాలు శనివారం జరగనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారంం అందించేందుకైనా తమ ప్రభుత్వం సిద్దం ఉందని.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపిరు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం జగన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంతరం ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ప్రధాన పెట్టుబడిదారులలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడితో మూడు ఎంవోయూలు కుదుర్చుకుని.. 77,000 మందికి ఉపాధిని కల్పించనుంది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ. 50,632 కోట్ల విలువైన ఆరు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసి.. 9,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.20 లక్షల కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉపాధి కల్పించే అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.