బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
అమరావతి:పచ్చపువ్వులతో నిండి టీజేపీగా బీజేపీ మారిందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆదివారంనాడు తాడేపల్లిలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.నిన్న ఏపీ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా వైసీపీ సర్కార్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
గతంలో చంద్రబాబు సర్కార్ లిక్కర్ షాపులను ఇద్దరికే కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. లిక్కర్ సిండికేట్ ను దందాగా నడిపింది టీడీపీ, బీజేపీ సర్కార్ కాదా అని ఆయన ఆరోపించారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం రేట్లు పెంచిన విషయాన్ని పేర్నినాని గుర్తు చేశారు.
undefined
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ల్యాండ్ ఉందన్నారు. సీఎం రమేష్, సత్యకుమార్, సుజనా చౌదరి మాటలను బుర్రలో ఎక్కించుకొని మాట్లాడితే అది మీ కర్మ అని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఇసుక విషయంలో రూ. 4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు.ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలన్నారు.ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ, బీజేపీ నేతలు దోచుకున్నారని ఆయన విమర్శించారు.
కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాజధానికిచ్చిన డబ్బులను చంద్రబాబు దోచేశారని బీజేపీ నేతలు విమర్శలు చేశారని పేర్ని నాని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2 లక్షల 16 వేల కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కర్ణాటకలో జనం ఊసిన ప్రభుత్వం మీదేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు ఆ రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కాగానే డీజీపీని ఢిల్లీకి ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని బీజేపీని పేర్ని నాని ప్రశ్నించారు.
also read:ఆ పన్నాగం పసిగట్టి కేసీఆర్ పక్కన పెట్టాడు: హరీష్ రావుకు పేర్ని నాని కౌంటర్
సీబీఐ పనితీరుపై మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు చేశారు. సీబీఐ ఏ రకంగా పనిచేస్తుందో దేశ ప్రజలకు తెలుసునన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రకమైన శాంతి భద్రతలున్నాయని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస చెలరేగుతుందన్నారు. ఇందుకు ఈశాన్య రాష్ట్రాల్లోని హింసాత్మక ఘటనలను ఆయన గుర్తు చేశారు. బీజేపీపై వచ్చిన ఆరోపణలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ విశాఖలో పర్యటించే అమిత్ షా తమపై విమర్శలు చేస్తే అప్పుడు స్పందిస్తామన్నారు.