ఏపీలోనూ శ్రీలంక పరిస్థితే...జగన్ విధానాల కారణంగానే.. : చంద్రబాబు ఆందోళన

By Arun Kumar PFirst Published Apr 4, 2022, 5:06 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ విధానాలతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోందని... ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక పరిస్థితి తప్పదని టిడిపి చీఫ్ చంద్రబాబు హెచ్చరించారు. 

అమరావతి: సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆరోపించారు. జగన్ విధానాలు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే ఏపీ కూడా మన పొరుగుదేశం శ్రీలంక (srilanka crisis)లో మాదిరిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్నతాధికారుల వ్యాఖ్యలే రాష్ట్ర పరిస్థితికి దర్పణం పడుతున్నాయని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ (TDP) ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు ఇవాళ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన జిల్లాల (new districts) ఏర్పాటుపై చంద్రబాబు మాట్లాడుతూ... కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి కొత్త జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటుచేసారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్దతిలో జిల్లాలను సరిదిద్దుతామని తెలిపారు.  

Latest Videos

ఇక కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బాద్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలపక్షాన నిలబడి పోరాడుతామన్నారు.  కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై ''బాదుడే బాదుడు'' పేరుతో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు.  కరెంట్ ఎందుకు పోతోందో... బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలన్నారు. కేవలం తన వ్యక్తిగత ఆదాయం కోసమే సీఎం జగన్ యావత్ రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

''అమరావతి (amaravati)లో 80 శాతం పూర్తి అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్ ఇప్పుడు మరో 5 ఏళ్లు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాడు. జగన్ పాలనపై చివరికి ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్ లు ఇస్తున్న విధానంపై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది'' అన్నారు. 

''జగన్ ప్రభుత్వ విధానాల కారణంగా రెడ్డి సామాజికవర్గంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల  ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పక్షాన నిలిచి ఓటేసినందుకు బాధపడుతున్నారు. జగన్ కు ఓటేసి అధికారాన్ని కట్టబెట్టి తప్పు చేశామనే భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉంది'' అని చంద్రబాబు అన్నారు.

ఇక సీపీఎస్ విషయంలో ఆందోళనలు చేస్తున్నవారికి  సంఘీభావం తెలిపాలని  టిడిపి నాయకులు నిర్ణయించారు. వైజాగ్ లో జరిగిన ల్యాండ్ స్కామ్ ను, దేవాలాయాలపై దాడులను సమావేశంలో పాల్గొన్న నేతలు ఖండించారు.  ఏ2 విజయసాయిరెడ్డి విశాఖ మధురవాడలో ఐటీ హిల్స్ లో ఏకంగా రూ.1,550 కోట్ల విలువ చేసే భూదందాకు పాల్పడ్డారని టిడిపి నాయకులు ఆరోపించారు. 

 రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా, అమ్మకం ద్వారా సీఎం జగన్ రెడ్డి వేల కోట్లు ఆర్జిస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల ద్వారానే కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. 


 

click me!