ఇకపై దేవాదాయ శాఖలో ప్రతి ఉద్యోగికి డ్రెస్‌కోడ్ : మంత్రి కొట్టు సత్యనారాయణ

By Siva KodatiFirst Published Aug 23, 2022, 4:59 PM IST
Highlights

త్వరలో దేవాలయాలతోపాటు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ డ్రెస్ కోడ్ ఉంటుందని తెలిపారు ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎండోమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు

ప్రతీ మంగళవారం దేవాదాయ శాఖపై రివ్యూ చేస్తున్నామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిడెడ్ కళాశాలలను ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పజెప్పబోతున్నామన్నారు. కందుకూరి వీరేశలింగం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. 2019కి ముందు 1600 దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2 వేలకు పైగా దేవాలయాలకు డీడీఎన్ఎస్ ఇచ్చామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే 427మందికి ఇచ్చామని.. రాష్ట్రంలోని ప్రతీ దేవాలయంలో దూపదీప నేవేద్యాలు జరపాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. 

దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక భూములు వివాదంలో ఉన్నాయని మంత్రి వివరించారు. కోర్టుల్లోనూ పలు భూముల కేసు తీర్పులు ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులు అసిస్టెంట్ కమిషనర్ కు అసైన్ చేసి స్టాండింగ్ కమిటీని పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండోమెంట్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని.. దేవాదాయ ధర్మాదాయశాఖలో పనిచేసే ప్రతీవ్యక్తికి డ్రెస్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని కొట్టు సత్యనారాయణ వివరించారు. 

ALso REad:అర్చకుల ఆధీనంలోని భూములపై హక్కు దేవాదాయ శాఖదే : మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

దసరా ఉత్సవాలు జరిపే ఆలయాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలవారీగా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్లు ఉత్సవాలను పర్యవేక్షిస్తారని.. దసరా ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాలయాలతోపాటు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ డ్రెస్ కోడ్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అన్యాక్రాంతం అయిన భూములకు సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలపై సీఎం జగన్ భరోసా ఇచ్చారని.. వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదని.. ఎండోమెంట్ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. 
 

click me!