
సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (ap govt employees) ఉద్యమ కార్యాచరణకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చారు ఉద్యోగ నేతలు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలైన బొప్పరాజు, బండి శ్రీనివాసులు ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మకు నోటీస్ అందజేశారు. అనంతరం ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) మీడియాతో మాట్లాడుతూ... సీఎస్‌కి ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇచ్చామని వెల్లడించారు. నెలరోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టు తిరిగి అలసిపోయామని.. తమకు ఇవ్వాల్సిన పిఆర్సీ (prc) , డీఏలు (da) వంటి 45 డిమాండ్స్ పరిష్కరించాలని వేడుకున్నామని శ్రీనివాసరావు గుర్తుచేశారు.
ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే అయ్యాయే తప్ప అమలు కాలేదని.. తాము ప్రకటించిన కార్యాచరణ యధావిధంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 7 నుంచి తమ ఉద్యమం ప్రారంభం అవుతుందని బండి వెల్లడించారు. ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమేనని... పిఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. 55శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని.. అలాగే తాము దాచుకున్న రూ.1600 కోట్లు ఇవ్వమని ఆడిగినా ఇవ్వడం లేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read:జగన్‌కు అల్టిమేటం.. ఉద్యమానికి సిద్ధం, సీఎస్‌కు నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు
ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు (ap amaravati jac) బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ.. 5పేజీల ఉద్యమ కార్యాచరణను సీఎస్ కు ఇచ్చామని ఆయన వెల్లడించారు. నవంబర్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సజ్జలతో పాటు మిగతా ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని బొప్పరాజు మండిపడ్డారు. గడిచిన మూడేళ్ళుగా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించామని.. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఉద్యోగులుగా సహకరించామని ఆయన గుర్తుచేశారు. అలాగే కోవిడ్ సమయంలో తమ వేతనాల్లో కోత విధించినా అంగీకరించామని బొప్పరాజు తెలిపారు.
కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పిందని... ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణమని వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు.. నివేదికలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుందని ఆయన ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఆయన.. జీతాల గురించి, ఉద్యోగులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వానికి , ఉద్యోగులకు మధ్య దూరం పెంచేలా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యోగులను సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రాంతీయ సభలు పెట్టబోతున్నామని.. పోరాటం ద్వారానే ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని వెంకటేశ్వర్లు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు సమస్యల పై స్పందిస్తారని ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.