
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వారాహి యాత్ర చేపట్టిన జనసేన పార్టీ పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రులు, ప్రభుత్వంపైనే కాదు వైసిపి నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు కూడా పవన్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా తాజాగా ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కూడా పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వారాహి యాత్ర పేరిట పవన్ చేపట్టిన లారీ యాత్ర అట్టర్ ప్లాప్ అవుతోందని సత్యనారాయణ అన్నారు. ఆయన ప్రసంగాలు ఉన్మాదంకి ఎక్కువ పిచ్చికి తక్కువగా ఉన్నాయన్నారు. ఈ ప్రసంగాలను బట్టి పవన్ మానసిక పరిస్థితి ఎలావుందో అర్థమవుతుందని అన్నారు. పవన్ సభలకు హాజరయ్యేవారి సంఖ్య వేల నుంచి వందల్లోకి పడిపోయిందని... ఆయన గ్రాప్ పదింతలు పడిపోయిందని మంత్రి సత్యనారాయణ అన్నారు.
కేవలం వైసిపి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయడానికి పవన్ వారాహి యాత్ర చేస్తున్నట్లుగా వుందని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి జగన్ ను తిట్టే విషయంలో పవన్ బాగానే మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు గురించి మాట్లాడేపుడే తేడా వచ్చేస్తోందన్నారు. గోదావరి జిల్లాలకు పవన్ ను పంపి ఓట్లు చీల్చాలన్నదే టిడిపి వ్యూహమని... కానీ అది పారేలా కనిపించడం లేదన్నారు. అసలు చంద్రబాబు పంచన చేరాల్సిన అవసరం పవన్ కు ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు. టిడిపి, జనసేనది అపవిత్రమైన పొత్తుగా సత్యనారాయణ పేర్కొన్నారు.
Read More నేను సీఎం అయితే అద్భుతాలు ఏమీ జరగవు..: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
గోదావరి జిల్లాల్లో వైసిపికి ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకుంటానని పవన్ అంటున్నారు... ముందు జనసేనకు ఒక్క సీటయినా తెచ్చుకోండి అంటూ మంత్రి ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు రగిల్చేదే పవన్ కల్యాణ్... ఈయనా తమకు సుద్దులు చెప్పేది అన్నారు. సమయం సందర్భం లేకుండా కాపు నేత ముద్రగడ పద్మనాభంపై ఆరోపణలు చేస్తారా? పవన్ వ్యాఖ్యలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కాపుల్లో చీలిక తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.