
ఏప్రిల్ 2, 3 తేదీల్లో అందుబాటులో ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఏపీ ప్రభుత్వం (ap govt) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (sameer sharma) గురువారం మెమో జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు గైర్హాజరు కావొద్దని సీఎస్ స్పష్టం చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతోపాటు విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు.. హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో జిల్లాల విభజనకు సంబంధించిన కార్యాచరణ ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం అధికారులందరితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. తొలుత కొత్త జిల్లాల నుంచి ఉగాది రోజున పాలన ప్రారంభించాలని భావించారు. అయితే ముహుర్తం, ఇతర అంశాలను పరిగణలోని తీసుకున్న ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లా ప్రారంభోత్సవం జరపాలని నిర్ణయించింది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాలకు కేబినెట్ వర్చువల్ విధానంలో ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. అలాగే కొత్తగా 22 రెవెన్యూ డిజిన్లను ఏర్పాటు చేయనున్నారు. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం.
అంతకుముందు బుధవారం నాడు సీఎం YS Jagan కొత్త జిల్లాలపై సమీక్ష నిర్వహించారు.. పది కాలాలు గుర్తుండేలా కొత్త జిల్లాల భవనాల నిర్మాణం చేయాలని ఆయన కోరారు. New Districts భవన నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తి చేయాలని CM ఆదేశించారు. కొత్ కలెక్టరేట్ల నిర్మాణం కోసం కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకొన్న జిల్లాల్లో కొత్త భవనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు ఒకే భవనంలో ఉండాలని జగన్ సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల 600 సలహాలు, సూచనలు వచ్చాయన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది, ఉద్యోగుల పోస్టింగ్ విషయమై సిక్స్ పాయింట్స్, రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా పాటించినట్టుగా సీఎంకు అధికారులు వివరించారు.