
వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో (sajjala rama krishna reddy) బీసీ మంత్రులు (bc ministers) ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకర నారాయణ, ఎమ్మెల్సీలు జంగా కృష్టమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ (Srinivasa Venu Gopala Krishna Chelluboyina) మీడియాతో మాట్లాడారు. జగన్ (ys jagan) తాను పాదయాత్రలో పరిశీలించిన బీసీ సమస్యల పరిష్కారానికి కనుకొన్న మార్గాల మీద, బీసీల కోసం నాడు చెప్పిన మాట నేడు ఆచరిస్తూ జగన్ ఆధ్వర్యంలో పాలన సాగుతోందన్నారు. బీసీ వర్గాల్లో సుమారు 139 కులాలు ఉంటే... 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యులు కానీ కులాల వారికి కూడా భాగస్వామ్యం కల్పించారని చెల్లుబోయిన అన్నారు.
ఆయా కులాల అభ్యున్నతి కోసం ... ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే ఈ సమావేశం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెటింగ్ కమిటీలలోనూ, ఆలయ కమిటీలలో ప్రత్యేకమైన రిజర్వరేషన్లు కల్పించామని వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇలా కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన వారి వివరాలను కూడా సేకరించి.. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని.. జగన్ వల్ల బీసీల రాజ్యాధికార దశ ప్రారంభమైందని వివరించాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. వారిలో ఉన్న ఆత్మన్యూనత్వాన్ని తొలగించి, ఆత్మగౌరవాన్ని పెంపోందించిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యకలాపాలను వారందరికీ వివరించాలని సమావేశంలో నిర్ణయించామని చెల్లుబోయిన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాలలోనూ ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. తద్వారా ఆ ప్రాంతీయ సదస్సుల నిర్వహణ అనంతరం రాష్ట్ర స్ధాయిలో ఒక సదస్సు నిర్వహించాలనే కార్యాచరణను నిర్ణయించామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సబ్‌ప్లాన్‌లో దాదాపు రూ. 31 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని చెల్లుబోయిన తెలిపారు. పాఠశాలలను నాడు–నేడు కార్యక్రమం ద్వారా బాగుచేయడంతో పాటు గోరుముద్ద, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన అందిస్తున్నామన్నారు. ఏ బలహీనవర్గాల తల్లులైతే పిల్లలను చదివించడానికి ఇబ్బందిపడతున్నారో... వారి కోసం ఈ పథకాలు ప్రవేశపెట్టారని వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వున్న 139 బలహీనవర్గాల కులాల వారికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, మున్సిపల్ కమిషనర్లుగా, జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఉపముఖ్యమంత్రులుగా జగన్ నియమించారని కొనియాడారు. జగన్ చెప్పినట్లు మార్కెటింగ్ కమిటీల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీ మెట్టు ఎక్కనివారికి కూడా ఇవాళ డైరెక్టర్లు, అధ్యక్షులుగా అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు. అలాగే ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఛైర్మన్లుగా చేసిన తీరు చూస్తే.. బీసీగా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా గర్వపడుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల బీసీ సోదరులు అనేకమంది రాజ్యపరిపాలనలో భాగస్వామ్యులయ్యారని మంత్రి చెప్పారు. అయితే దీన్ని క్షేత్రస్ధాయిలో ప్రజలకు ఏ విధంగా వివరించాలి అనేదానిమీద చర్చించామని వేణుగోపాలకృష్ణ తెలిపారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, నేను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారందరినీ ఒక తాటిమీదకు తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ మంత్రులందరూ మంచి సూచనలు చేశారని.. వీటన్నింటినీ క్రోఢీకరించి.. పార్టీ తరపున ఒక సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసుకున్నామని చెల్లుబోయిన తెలిపారు. ఇంకా మంచి సలహాలు, సూచనలు తీసుకెళ్లి బీసీలకు ఈ ప్రభుత్వం వల్ల ఎన్నిమేళ్లు జరిగాయో తెలియజేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మూడు సంవత్సరాల పాలనలో.. కరోనా కష్టం వచ్చినా కూడా వారికి కష్టం లేకుండా చూసిన తీరుని వారికి వివరించాలని నిర్ణయించామని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
పేదవాడు పేదరికంపై యుద్ధం చేసి దాని నుంచి బయటకు రావాలంటే కావాల్సిన శక్తి ధనమని... దానిని డీబీటీ ద్వారా ఇచ్చిన పాలకులెవరూ లేరని మంత్రి తెలిపారు. సిఫార్సులకు, అవినీతికి, లంచాలకు తావులేకుండా ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో వుందని చెల్లుబోయిన పేర్కొన్నారు. పేదవాడు ఎక్కడున్నా వెదకడానికి వాలంటీర్ వ్యవస్ధ వచ్చిందని... అర్హత ఉంటే ఎవరినీ అడగకుండానే పథకం వస్తుందనే ఆలోచన వచ్చందని మంత్రి చెప్పారు.
ఇక విద్యుత్ ఛార్జీల పెంపుపైనా, టీడీపీ ఆందోళనలపై మంత్రి చెల్లుబోయిన స్పందిస్తూ... వారి పాలనాకాలంలో ఒక్క రూపాయి కూడా పెంచనట్టు వారు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి పాలనా కాలంలో ఒక్క రూపాయి పెంచలేదని వేణుగోపాలకృష్ణ గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు 25 సార్లు విద్యుత్ ధరలు పెంచారని... ఎన్టీఆర్ ఇచ్చిన రూ.50 హార్స్ పవర్‌నే తీసేసి రూ.350 చేశారంటూ దుయ్యబట్టారు. ప్రజల దృష్టి మరల్చాలని.. అధికారం కోసం తపన, తాపత్రయంతో టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని మంత్రి ఫైరయ్యారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని.. వారికి కష్టం వస్తే.. ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో వారికి తెలుసునని చెల్లుబోయిన స్పష్టం చేశారు.