చంద్రబాబుపై పరువు నష్టం దావాకు ఎపీ సిఎస్ యోచన

By telugu teamFirst Published Apr 14, 2019, 8:26 AM IST
Highlights

చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఎఎస్ అధికారులు ఆయనకు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను సహ నిందితుడిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్రుగా ఉన్నారు. తనపై మరింత బురద చల్లే ప్రయత్నాలను నిలువరించడానికి ఏం చేయాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. 

చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఎఎస్ అధికారులు ఆయనకు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి హైకోర్టు 2018 జనవరిలో ఆయనకు విముక్తి ప్రసాదించింది. హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు తనను నిందితుడిగా పేర్కొనడంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. 

ఎన్నికల కమిషన్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల వేళ సిఎస్ ను బదిలీ చేసి, ఎల్పీ సుబ్రహ్మణ్యాన్ని ఆ స్థానంలో నియమించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి చంద్రబాబు ఆయనను జగన్ కేసులో నిందితుడిగా విమర్శిస్తూ వస్తున్నారు. 

click me!