Andhra Pradesh లో సచివాలయ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌...ఇక నుంచి వారంలో రెండు రోజులు..!

Published : Jun 21, 2025, 10:22 AM IST
up outsourcing nigam women job reservation widow divorcee benefits sarkari naukri

సారాంశం

అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఐదు రోజుల పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. మరోవైపు గిరిజన టీచర్లు, పోలీస్ అధికారులకు కొత్త ఉత్తర్వులు విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వీరికి ఇప్పటికే అమలులో ఉన్న ఐదు రోజుల వారం పని విధానాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 27 నుంచి ఈ కొత్త కాలపరిమితి అమల్లోకి రానుంది.

ఈ ఐదు రోజుల పని విధానం మొదటగా 2016లో ప్రవేశపెట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల కుటుంబాల కోసం వారానికి రెండు రోజులు సెలవు ఇవ్వడం వల్ల వారు వ్యక్తిగత పనులకు సమయం కేటాయించుకునే అవకాశం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇది అమలులోకి వచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని సమయాన్ని నిర్ణయించారు.

ఉద్యోగులందరికీ…

ఈ విధానం అమరావతిలో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కానీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇది వర్తించదు. వారికైతే వారానికి ఆరు రోజులు విధిగా పని చేయాల్సి ఉంటుంది. వీరి పని సమయం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

వారానికి ఐదు రోజులే…

హైదరాబాద్ నుంచి విభజన తర్వాత అమరావతికి తరలించిన సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు నివాస సమీపంలో క్వార్టర్స్ ఏర్పాటు చేయడం, వారానికి ఐదు రోజులే పని చేయించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో శని, ఆదివారాల్లో కుటుంబాన్ని కలవడానికి హైదరాబాద్ వెళ్లే అవకాశం కూడా ఉద్యోగులకు లభిస్తోంది. ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతున్నది.

ఇది మాత్రమే కాకుండా, ఏపీ ప్రభుత్వం మరికొన్ని కీలక ఉత్తర్వులను శుక్రవారం విడుదల చేసింది. గిరిజన అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న రెసిడెన్షియల్ టీచర్ల (CRT) సేవలను మరో 11 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,268 మంది టీచర్లు ఈ పొడిగింపు లబ్ధిదారులు. ఈ ఉత్తర్వులు జూన్ 1, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటాయి.

అలాగే రాష్ట్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘాలు (PACS)– మొత్తం 1,948 సంఘాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అధికారులే ఇంకా కొనసాగనున్నారు. జులై నెలాఖరు వరకు వారి బాధ్యతలు యథాతథంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమంటే, ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం (అలవెన్స్) మంజూరు చేశారు. ఇది వారి ప్రాథమిక వేతనంపై ఆధారపడుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జారీ చేశారు. ఈ నిర్ణయం ISW లో పని చేసే సిబ్బందికి ఆర్థికంగా ఊరటను కలిగించనుంది.

ఇక బదిలీల విషయానికి వస్తే, విజయనగరం జిల్లా APSP 5వ బటాలియన్‌కు అదనపు కమాండెంట్‌గా రాజారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన OCTOPUS విభాగంలో అదనపు కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనను అక్కడి నుంచి విజయనగరానికి బదిలీ చేశారు. ఇది కూడా హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సాధ్యమైంది.

ఇక అసలు ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే, కాలుష్య నియంత్రణ మండలిలో ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 2025లో నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 18 పోస్టుల భర్తీకి ప్రాథమిక జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 1న తమ ధ్రువపత్రాల పరిశీలన కోసం కమిషన్ కార్యాలయానికి హాజరుకావలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది.

ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఒకే రోజు అనేక విభిన్న రంగాలకు చెందిన నిర్ణయాలను తీసుకుని, సంబంధిత ఉద్యోగుల, అభ్యర్థుల జీవనంలో తాత్కాలికమైనా స్థిరత్వాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల వారం విధానం కొనసాగింపు, టీచర్ల సేవల పొడిగింపు, పోలీస్ సిబ్బందికి అలవెన్స్ మంజూరు, బదిలీలు, నియామకాల ప్రకటనలు అన్నీ కలిపి ఉద్యోగుల మధ్య సంతృప్తిని కలిగించాయి.

ఇక నుంచి అలా చేస్తే కుదరదు..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఒకే సచివాలయంలో 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి కానుంది. ఇకపై సొంత మండలంలో ఉద్యోగిని నియమించకూడదని స్పష్టం చేసింది. బదిలీ అయిన వారి వివరాలను జులై 10లోపు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (HRMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యోగుల సంఖ్య అవసరానికి మించి ఉంటే, కొందరిని అక్కడే కొనసాగించే అవకాశం ఉంది. ఈ విషయంలో తుది నిర్ణయం కలెక్టర్లదే. మొత్తం బదిలీ ప్రక్రియను జూన్ 30లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు ప్రత్యేక శ్రేణిలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. వీరిలో శారీరకంగా వికలాంగులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పైగా పనిచేసినవారు, కారుణ్య నియామకంలో ఉద్యోగాలు పొందినవారు ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే, వీలైనంత వరకు దగ్గర ప్రాంతాలకు బదిలీ చేసేలా చూడాలని చెప్పింది. వీరి బదిలీలను 'రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లు'గా పరిగణించి ట్రావెల్ అలవెన్స్‌ కూడా ఇవ్వనుంది.

ఇటీవలి జనాభా గణాంకాల ఆధారంగా సచివాలయాలను 'ఏ', 'బీ', 'సీ' కేటగిరీలుగా విభజించారు. 'ఏ' కేటగిరీలో 6 మంది, 'బీ'లో 7 మంది, 'సీ'లో 8 మంది వరకు ఉద్యోగులను నియమించాలన్నది తాజా మార్గదర్శకం. ఈ సంఖ్యలకు అనుగుణంగా హేతుబద్ధీకరణ చేస్తారు.బదిలీల అనంతరం మిగిలిన ఉద్యోగులను అవసరమైన ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపే అవకాశం ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?