కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలివే..: కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్ పర్సన్ కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Apr 29, 2021, 5:28 PM IST
Highlights

ఎంత త్వరగా టెస్ట్ రిపోర్ట్ ఇస్తే పేషెంట్లకు అంత త్వరగా వైద్య సేవలు అందించే అవకాశం వుంటుందని... దీంతో మరణాలను తగ్గించగలమని ఏపీ కోవిడ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 

విజయవాడ: కరోనా లక్షణాలతో బాధపడుతూ టెస్టు చేయించుకున్న వారికి అదేరోజు ఫలితం అందించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్ పర్సన్  డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా పేషెంట్లకు త్వరితగతిన వైద్య సేవలు అందించే అవకాశం వుంటుందని... దీంతో మరణాలను తగ్గించగలమని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ కు  యుద్ధ ప్రాతిపదికన చర్యలు  చేపట్టాలని సూచించారు. రాబోయే 48 గంటల్లో క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు చేయాలని ఆదేశించారు. అలాగే 48 గంటల్లో ఆర్టిపిసిఆర్ టెస్ట్ ద్వారా అన్ని బ్యాక్లాగ్ శాంపిళ్లనూ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఏడు రోజులకంటే ఎక్కువ ఉన్న శాంపిళ్లన్నంటినీ పక్కనుపెట్టి శాంపుల్ ఐడి ఎవరైనా కోరినట్లయితే అప్పుడు టెస్ట్ చేయాలని సూచించారు. 

''కోవిడ్ హాస్పిటల్లో అనేకమంది పేషెంట్లు చిన్నచిన్న సమస్యలతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. పేషెంట్ ను ఐడెంటిఫై చేసి అవసరమైనవారికి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్  కేర్ సెంటర్ లో అడ్మిట్ చెయ్యాలి. సీరియస్ పేషెంట్లకు కోవిడ్ హాస్పిటల్ లో అడ్మిషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేయాలి. కొద్దిగా లక్షణాలున్న పేషెంట్లందరినీ  కోవిడ్ కేర్ సెంటర్ కి పంపించి అక్కడ  కొన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచాలి. దీంతో మైల్డ్ పేషెంట్స్ కి తగిన వైద్య సదుపాయం అందజేసిన వారమవుతాము'' అన్నారు. 

read more   కరోనా టెన్షన్ : ఆస్పత్రి నుంచి పరారైన బాదితుడి ఆత్మహత్య..!

''ప్రతి జిల్లాలో కనీసం మూడు వేల బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా సన్నద్ధం చేయాలి. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను పెట్టినట్లయితే మైల్డ్ కోవిడ్ పేషెంట్లకు చక్కటి సదుపాయం కలిగించి నట్లవుతుంది.  ప్రతి జిల్లా లో 1000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ను కల్పించే ప్రయత్నం చేయాలి.పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సప్లై ను వాడుకోవాలి. డిఫెన్స్ వారి సహాయంతో వాయు మార్గం ద్వారా ట్యాంకర్లు పంపి ఆక్సిజన్ ను ఒడిశాలోని అంగూల్  లాంటి ప్రదేశాలనుంచి తెచ్చే ప్రయత్నం చేయాలి.  లోకల్ గా ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడి ఇండస్ట్రియల్ గ్యాస్ సిలిండర్ ను మెడికల్ గ్యాస్ సిలిండర్ గా మార్చి లోకల్ సప్లై కు అనుగుణంగా వాడుకోవాలి'' అని సూచించారు.

''బిహెచ్ఈఎల్ తో పాటు ఇతర సంస్థలతో మాట్లాడి  క్రయోజనిక్ ట్యాంకర్ తయారీ విషయంలో, వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా విషయంలో తగు చర్యలు త్వరగా తీసుకోవాలి. కోవిడ్ మృత దేహాల  డిస్పోజల్ విషయంలో పూర్తి ప్రోటోకాల్ తయారుచేసి  తగు చర్యలు తీసుకోవాలి'' అని డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. 


 

click me!