
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, కీలక నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం అయ్యేటట్లు పర్యవేక్షించమని జగన్ చెప్పారని బొత్స పేర్కొన్నారు. ప్రతి ఇంటికి, కుటుంబానికి పార్టీ కార్యక్రమాలు చేరే విధంగా చూడమన్నారని.. ప్రజల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించారని సత్యనారాయణ తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య విబేధాలు వుంటే సరిదిద్దే బాధ్యత రీజనల్ కో ఆర్డినేటర్లదేనని తేల్చిచెప్పారని బొత్స చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి వెల్లడించారు. దీనిని పర్యవేక్షించే బాధ్యత రీజినల్ కో ఆర్డినేటర్లదేనని సీఎం పేర్కొన్నారని ఆయన చెప్పారు. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని అన్నారని బొత్స పేర్కొన్నారు. పార్టీలో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో వుండటంలో కొత్తేం లేదని మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు, నేతల మధ్య విభేదాలను తొలగిస్తామని బొత్స వెల్లడించారు.
ALso REad : కారణం లేకుండా ఎవరికీ టిక్కెట్టు నిరాకరించను: గడప గడపకు వర్క్ షాప్ లో జగన్
అంతకుముందు సోమవారంనాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్టు నిరాకరించడం వెనుక కారణాలుంటాయని సీఎం జగన్ చెప్పారు. ఎమ్మెల్యే టిక్కెట్టు నిరాకరించిన వారికి అవకాశాలు కల్పిస్తామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోతే ఎమ్మెల్సీ పదవి లేదా కార్పోరేషన్ చైర్మెన్లుగా నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
2029 లో నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 2029లో పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్ చేస్తానని .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినవారు మన బటన్ బ్యాచ్ కాదని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రేడింగ్ ఇచ్చిన జగన్ ఈసారి మాత్రం గ్రేడింగ్ ఇవ్వలేదు.