రాష్ట్రపతి ఆమోదం కోసం నిరీక్షణ: ‘‘దిశ’’ బిల్లులపై జోక్యం చేసుకోండి.. స్మృతీ ఇరానీకి జగన్ లేఖ

By Siva KodatiFirst Published Jul 2, 2021, 5:04 PM IST
Highlights

ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ‘‘దిశ ’’ పేరిట ఏపీ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దిశ బిల్లులకు ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు

ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ‘‘దిశ ’’ పేరిట ఏపీ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దిశ బిల్లులకు ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు. ఈ నేపథ్యంలో బిల్లులపై జోక్యం చేసుకుని ఆమోదించేలా చూడాలంటూ శుక్రవారం ఏపీ సీఎం జగన్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. 

కేంద్రం మహిళల, బాలల సాధికారత లక్ష్యంగా మిషన్ పోషణ్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య పేరిట అనేక కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయం అని సీఎం జగన్ ప్రశంసించారు. మహిళలు, చిన్నారులకు పోషకాహారం, సంక్షేమం అందించడంతో పాటు వారికి భద్రత కల్పించడం కూడా అత్యవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు భరోసాతో కూడిన భద్రతను అందించడం ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఒకటని జగన్ స్పష్టం చేశారు.

Also Read:ఫలించిన జగన్ వ్యూహం: ఏపీలో భారీగా పెరిగిన దిశా యాప్ డౌన్ ‌లోడ్‌లు

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు, సత్వర స్పందన కోసం హెల్ప్ డెస్కులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. దిశ చట్టం రాకముందే తాము మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని తన లేఖలో సీఎం జగన్ వివరించారు. తాము తీసుకువచ్చిన దిశ కార్యాచరణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని, దిశ యాప్, దిశ కమాండ్ కంట్రోల్, దిశ ఇన్వెస్టిగేషన్ వెహికిల్, దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లకు గాను 4 స్కోచ్ అవార్డులు కూడా లభించాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

వీలైనంత త్వరగా ఈ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు అందించాలని సీఎం జగన్ తన లేఖలో స్మృతీ ఇరానీని విజ్ఞప్తి చేశారు. కాగా, గతంలో దిశ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్రానికి పంపగా, కేంద్రం వాటిని తిప్పి పంపింది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన మేరకు సవరణలు చేసి మరోసారి ఏపీ ప్రభుత్వం దిశ బిల్లులను పంపింది. నాటినుంచి వీటికి రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు.

click me!