చాలా అవమానంగా ఉంది.. వివేకా కేసును తేల్చండి: సీబీఐతో జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

By Siva Kodati  |  First Published Sep 5, 2021, 3:37 PM IST

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరానని అన్నారు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి .  వివేకా హత్య కేసులో తొలిసారిగా ఆయన ఈ విచారణకు హాజరయ్యారు


వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా పరిష్కరించాలని సీబీఐ అధికారులను కోరానని అన్నారు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి . వివేకా హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు చేస్తున్న విచారణ 90వ రోజుకు చేరింది. అందులో భాగంగా శనివారం సాయంత్రం రవీంద్రనాథ్‌రెడ్డిని సీబీఐ అధికారులు గంటసేపు విచారించారు.

వివేకా హత్య కేసులో తొలిసారిగా ఆయన ఈ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన మొదటి వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. విచారణ అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... వివేకా తనకు బంధువని... దానికి తోడు రాజకీయ నాయకుడిని కావడంతో విచారణకు పిలిచారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. వివేకాతో ఎలాంటి సంబంధాలున్నాయి.? ఆయన మీతో ఎలా ఉండేవారని సీబీఐ అధికారులు తనను ప్రశ్నించారని ఆయన తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని చెప్పానని.. కేసును త్వరగా పరిష్కరించమని కోరగా ప్రయత్నిస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు అని రవీంద్రనాథ్ రెడ్డి వివరించారు. 

Latest Videos

click me!