
నరేంద్ర మోడీ ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై దేశంలోని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్ధతు ప్రకటించడం గర్వంగా వుందన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం చాలా ముఖ్యమని, గడిచిన 4 ఏళ్లలో ఏపీలో ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిథ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించామన్నారు. కలిసికట్టుగా మరింత సమానమైన భవిష్యత్తును సృష్టిద్దామని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్ధతు ఇస్తుందన్నారు. మహిళల కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. నామినేటెడ్ పోస్టులతో పాటు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని మిథున్ రెడ్డి ప్రశంసించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కొన్ని అంశాల్లో విభేదాలు రావొచ్చేమో కానీ అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతు తెలుపుతాయని మిథున్ రెడ్డి ఆకాంక్షించారు.
అంతకుముందు మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్. ఈ బిల్లుకు ‘‘నారీశక్తి వందన్ ’’ అనే పేరు పెట్టారు. రేపు ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చించనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చించనున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఇకపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. ప్రస్తుత లోక్‌సభ , అసెంబ్లీలపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. డీలిమిటేషన్ తర్వాతనే బిల్లును అమల్లోకి తీసుకొస్తారు.