టీడీపీ, జనసేనలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నర్సరావుపేటలో నిర్వహించిన సభలో జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మండి పడ్డారు.
అమరావతి: Chandrababu, Pawan Klayan లు ఓ దొంగల ముఠా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.ఈ ముఠా హైద్రాబాద్ లో మకాం పెట్టిందన్నారు. హైద్రాబాద్ లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.తాము ఇదే రకమైన సంక్షేమ పాలనను కొనసాగిస్తే టీడీపీ, జనసేన బాక్సులు బద్దలౌతాయన్నారు.
గురువారం నాడు నర్సరావుపేటలో వాలంటీర్లకు అవార్డులు ఇచ్చారు సీఎం జగన్., ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ టీడీపీ, జనసేనలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.పాదయాత్ర తర్వాత ఎన్నికల ముందు రెండు పేజీలతో మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను 95 శాతం అమలు చేసినట్టుగా సీఎం YS Jagan చెప్పారు.
గతంలో అధికారంలో ఉన్న ఎల్లో పార్టీ కంటే కనీవినీ ఎరుగని విధంగా ప్రజలకు మేలు చేశామన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో తమకు రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా దక్కవనే ఏడుపు ఎల్లో పార్టీలో కనిపిస్తోందన్నారు. ఎల్లో పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీల్లో కూడా కన్పిస్తుందన్నారు. ఈ పార్టీలతో పాటు కూడా ఎల్లో మీడియాలో ఇదే భయం కన్పిస్తుందన్నారు. మంచి చేసే వాడికే దెబ్బలు తగిలినట్టుగానే మంచి చేసే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ , ఎల్లో మీడియా ఈ కొత్త ప్రచారాన్ని అందుకున్నారని జగన్ విమర్శించారు.ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ దుర్మార్గుల ముఠా నిలబెట్టుకోలేదని జగన్ విమర్శించారు. గతంలో ప్రభుత్వ ఖజానాను దోచుకొన్న దొంగల ముఠాగా చంద్రబాబును అభివర్ణించారు సీఎం జగన్, ఎన్నికల సమయంలో పచ్చి అబద్దాలును ప్రజల ముందుకు తీసుకొచ్చిందన్నారు.ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి హైద్రాబాద్ లో దొంగల ముఠా మకాం పెట్టిందని జగన్ ఫైరయ్యారు.
తమ ప్రభుత్వ పాలనను చూసి తమకు భవిష్యత్తులో ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేరనే భయంతోనే రాష్ట్రం శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పేదలకు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా అని జగన్ ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందని చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు. ఇలా మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు మనసు గానీ నీతి గానీ న్యాయం గానీ, ధర్మం వంటి పదాలకు అర్ధం తెలుసా అని సీఎం అడిగారు.
గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను చూడాలని జగన్ ప్రజలను కోరారు.
మన రైతులు,మన పేదలు, మన పిల్లల్ని ద్వేషించే వారిని మనుషులు అనాలా, మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అనాలో చెప్పాలన్నారు. ఎల్లో మీడియాను మీడియా అనాలా రక్త పిశాచులు అనాలా అని సీఎం అడిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తాను గంటకు పైగా సమావేశమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా జీర్ణించుకోలేదన్నారు.
మోడీ తనకు క్లాస్ పీకారాని మీడియాలో కథనాలు రావడాన్ని జగన్ ప్రస్తావించారు. మోడీ సోఫా కింద కానీ, తాను కూర్చొన్న సీటు కింద ఎవరైనా ఉన్నారా అని మీడియాను అడిగారు. అసూయకు మందు లేదన్నారు. ఇలా అసూయ పడితే త్వరగా బీపీలు, గుండెపోట్లు వస్తాయన్నారు.. అంతేకాదు త్వరగా చనిపోతారని జగన్ శాపనార్ధాలు పెట్టారు.
నీతిగా ఉన్నవారితో యుద్ధం చేయడం లేదన్నారు. మారీచుడితో యుద్ధం చేస్తున్నామని జగన్ చెప్పారు.రాక్షసులతో యుద్ధం చేస్తున్నామన్నారు.మారీచుడు ఎప్పుడంటే అప్పుడు రూపం మార్చుకొన్నట్టుగానే ఈ నేతలు కూడా ఏ పార్టీతోనైనా కూడా పొత్తులు పెట్టుకొంటున్నారు. ఏదైనా మాట్లాడుతారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమకు నచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి పోటీ చేస్తారన్నారు. కానీ తమకు గిట్టని ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేస్తారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై జగన్ మండిపడ్డారు.
వీరంతా పైకి వేర్వేరు పార్టీల్లో ఉన్నా అంతా దొంగల ముఠా అని జగన్ ఫైరయ్యారు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జగన్ వివరించారు. ఈ దొంగల ముఠా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిందా లేదా ఆలోచించాలన్నారు. మంచి జరిగితే తనను ఆశీర్వదించడం, చెడు జరిగితే ద్వేషించాలని జగన్ ప్రజలను కోరారు.