
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు (గురువారం) జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ పునర్య్వవస్థీకరణ నేపథ్యంలో.. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ భేటీలో సీఎం జగన్ మంత్రలు రాజీనామా కోరే అవకాశం ఉందని తెలిసింది. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మొత్తం మంది మంత్రులు రాజీనామా చేయనున్నట్టుగా వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు అందజేసి వాటికి ఆమోదం తెలుపాల్సిందిగా కోరనున్నారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గ జాబితాను గవర్నర్‌కు సీఎం జగన్‌కు అందజేయనున్నారు. వారిచే ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను కోరనున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే కొత్తగా కొలువుదీరే కేబినెట్‌లో.. మొత్తం కొత్త వారికే అవకాశం కల్పిస్తారా..? లేదా ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి తిరిగి ముగ్గురు, నలుగురికి చోటు కల్పించనున్నారనే చర్చ విస్తృతంగా సాగుతుంది.
ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. సీఎం జగన్ కేబినెట్ పునర్య్వవస్థీకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రివర్గ పునర్య్వవస్థీకరణకు సంబంధించి జగన్.. జాబితాను సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరో రెండు మూడు రోజుల వరకు ఈ జాబితాను గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.
ఇక, బుధవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ సాగింది. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ గురించి సీఎం గవర్నర్‌కు వివరించినట్టుగా తెలిసింది. 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని సీఎం జగన్ కోరగా.. దీనికి గవర్నర్ అంగీకరించారు. ఇక, ఇటీవల చేపట్టిన జిల్లాల పునర్విభజన గురించి కూడా గవర్నర్‌కు సీఎం జగన్ వివరించారు.
వారికి ఇంకోసారి చాన్స్..!
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిలో ముగ్గురు లేదా నలుగురిని మళ్లీ మంత్రులుగా తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేబినెట్ పునర్య్వవస్థీకరణ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేశారు.
ప్రస్తుత కేబినెట్‌లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఐదుగురు, బీసీల నుంచి ఏడుగురు, ఎస్టీల నుంచి ఒకరు, మైనార్టీల నుంచి ఒకరు, కాపు సామాజిక వర్గం నుంచి నలుగురు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు, క్షత్రియుల నుంచి ఒకరు, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురిని నియమించగా వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు.